Air India flight crash: ఆశలు బుగ్గిపాలు | Air India flight crash: Doctor couple and their three kids tragedy struck | Sakshi
Sakshi News home page

Air India flight crash: ఆశలు బుగ్గిపాలు

Jun 13 2025 5:46 AM | Updated on Jun 13 2025 5:46 AM

Air India flight crash: Doctor couple and their three kids tragedy struck

ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన వద్దకు చేర్చుకుని హాయిగా జీవిద్దామని భావించిన ఓ భారతీయుని కల కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. విమాన ప్రమాద ఘటనలో ఈ హృదయవిదారక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్‌ జోషి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గత ఆరేళ్లుగా లండన్‌లో పనిచేస్తున్నారు. అతని భార్య డాక్టర్‌ కౌమీ వ్యాస్‌ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. 

వీళ్లకు ఎనిమిదేళ్ల కూతురు మిరాయా, ఐదేళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్‌ ఉన్నారు. కుటుంబం మొత్తాన్నీ లండన్‌కు శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్‌ ప్రయత్నాలు ఇటీవల సఫలమయ్యాయి. దీంతో కేవలం రెండ్రోజుల క్రితమే భార్య కోమీ తన డాక్టర్‌ ఉద్యోగానికి రాజీనామాచేసింది. కొద్దిరోజుల క్రితం ప్రతీక్‌ భారత్‌కు వచ్చి కుటుంబంతో సహా లండన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. 

బ్యాగులనీ ప్యాక్‌ చేసుకుని ఇరు కుటుంబాలకు టాటా బైబైలు చెప్పి అందమైన భవిష్యత్తుపై కలలలో ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. లండన్‌కు వెళ్లే విమానం ఎక్కగానే తమ తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీతీసుకున్నారు. భార్యాభర్త పక్క సీట్టలో, కవల సోదరులు, సోదరి మరో సీట్లో కూర్చుని నవ్వుతూ దిగిన ఫొటోను బంధువులకు వెంటనే పంపేశారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నామనుకున్నారుగానీ సమిధలౌతామని అస్సలు ఊహించి ఉండరు. 

ప్రమాదంలో ఎగసిన అగ్నికీలలో కుటుంబం మొత్తం కాలిబూడిదైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది. జీవితం క్షణభంగురం. నువ్వు నిర్మించిన, నువ్వు కలలుగన్న, నువ్వు ప్రేమించినదంతా ఒక సెకన్‌లో సమాధిగా మారిపోయింది. అందుకే ఇప్పుడే జీవించు, ఇప్పుడే ప్రేమించు. రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. జీవితం అస్థిరం. అది ముగిసేలోపే వీలైనంత ప్రేమను పెంచుదాం. పంచుదాం..
 

Advertisement
 
Advertisement
Advertisement