నా కొడుకు రాజకీయాల్లోకి రాడు.. పళని సంచలన ప్రకటన | aiadmk palaniswami Statement Over His Son Political Entry | Sakshi
Sakshi News home page

నా కొడుకు రాజకీయాల్లోకి రాడు.. పళని సంచలన ప్రకటన

Jun 19 2026 1:43 PM | Updated on Jun 19 2026 1:51 PM

aiadmk palaniswami Statement Over His Son Political Entry

సాక్షి, చైన్నె: తన కుమారుడు మిథున్‌ రాజకీయాల్లోకి ప్రవేశించబోవడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూనే, కొత్తగా ఏర్పాటైన టీవీకే కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

వారసత్వ రాజకీయాలపై క్లారిటీ
తన కుమారుడు మిథున్‌ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్ని టీవీ ఛానళ్లలో జరుగుతున్న చర్చలు ముమ్మాటికీ అవాస్తవమని ఖండించారు. ఆయన కేవలం అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యుడిగా మాత్రమే ఉన్నారన్నారు. పార్టీలో ఎలాంటి పదవిలోనూ లేరని, తన కుమారుడు మిథున్‌ భవిష్యత్తులోనూ రాజకీయాల్లోకి రాబోరని నేను కచ్చితంగా, స్పష్టంగా తెలియజేస్తున్నానని అన్నారు. మీడియా సంస్థలు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నిలిపివేయాలని కోరారు. అలాగే అన్నాడీఎంకేను ఎవరూ కదిలించలేరని, గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ప్రసంగం కేవలం కలలో వేసిన నీటి మూట లాంటిదని ఎద్దేవా చేశారు.

మళ్లీ రాజుకున్న అసంతృప్తి 
మరోవైపు.. అన్నాడీఎంకేలో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. గురువారం  అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే, అసంతృప్త ఎమ్మెల్యేలంతా సీనియర్‌ నేత సి.వి. షణ్ముగం నివాసంలో ఆకస్మికంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  అసెంబ్లీలో విజయ్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలుతలెత్తిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్లు  వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతోపార్టీ ప్రధాన కార్యదర్శి  పళనిస్వామికి షాక్‌ తప్పలేదు.  ఆ తదుపరి పరిణామాలతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి నలుగురు రాజీనామా చేశారు. చివరకు రాజీ చర్చలతో వేలుమణితోపాటుగా ఇతర ఎమ్మెల్యేలు పళణి పక్షాన చేరారు. 

అయితే, సీవీ షణ్ముగం, సీ విజయ భాస్కర్‌ మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. వీరిలో సీ విజయ భాస్కర్‌ తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. సీవీ షణ్ముగం మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని పట్టుబడుతున్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం చెన్నైలోని సీవీ షణ్ముగం నివాసంలో జరిగినæ ఆకస్మిక సమావేశంలో వేలుమణి, నత్తం విశ్వనాథన్, కె.పి. అన్బళగన్‌ హాజరు కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement