చంబల్‌ నదిలో 900 చిరు మొసళ్ల సందడి | 900 Small Crocodiles Echoed In The Chambal River In Agra, Details Inside | Sakshi
Sakshi News home page

చంబల్‌ నదిలో 900 చిరు మొసళ్ల సందడి

Jun 10 2024 8:09 AM | Updated on Jun 10 2024 10:16 AM

900 Small Crocodiles Echoed in the Chambal

మొసలి... ఈ పేరు వినగానే మనకు దాని రూపం గుర్తుకు వచ్చి, మనసులో భయం కలుగుతుంది. భారీ మొసలి రూపాన్ని పక్కన పెడితే, చిరు మెసలిని చూసినప్పుడు ఎంతో కొంత ముచ్చటేస్తుంది. మరి వందల సంఖ్యలో చిరు మొసళ్లు ఒకేసారి కనిపిస్తే..

ఆసియాలోని అతిపెద్ద మొసళ్ల అభయారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా బాహ్‌లో ఉంది. ఇక్కడ ఇప్పుడు వందలకొద్దీ చిరు మొసళ్లు సందడి చేస్తున్నాయి. మహుశాల, నంద్‌గావాన్, హత్‌కాంత్ ఘాట్‌ల మీదుగా సుమారు 900 చిరు మొసళ్లు భారీ మగ మొసళ్లను అనుసరిస్తూ చంబల్ నదికి చేరుకున్నాయి.

అటవీ రేంజ్ నుండి వస్తున్న శబ్ధాన్ని విన్న అటవీ శాఖ అధికారుల బృందం చంబల్‌ నది సమీపానికి చేరుకుంది. అక్కడి దృశ్యాన్ని చూసిన అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. మొసళ్లు పిల్లలను కనే ప్రక్రియ దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అంతరించిపోయే స్థితికి చేరుకున్న మొసలి జాతిని 1979 నుండి చంబల్ నదిలో సంరక్షిస్తున్నారు. ఈ నది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల గుండా పాలి (రాజస్థాన్) మీదుగా ప్రవహిస్తుంది.

2008లో బాహ్, ఇటావా, భింద్, మోరెనాలలోని చంబల్ నదిలో వందకుపైగా మొసళ్లు మృతి చెందాయి. ఆ సమయంలో మొసళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విదేశీ నిపుణులను సంప్రదించాల్సి వచ్చింది. అప్పట్లో లివర్ సిర్రోసిస్ వ్యాధి కారణంగా మొసళ్లు చనిపోయాయని గుర్తించారు. అయితే ఆ తరువాత నుంచి మొసళ్ల సంఖ్య  పెరుగుతూ వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చంబల్‌ నదిలో 2,456 మొసళ్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement