భర్తను చంపి.. బాత్రూమ్‌లో పాతిపెట్టి.. | Woman Allegedly Kills Husband, Buries Body Under Bathroom Floor In Agra, Truth Comes Out After 45 Days | Sakshi
Sakshi News home page

భర్తను చంపి.. బాత్రూమ్‌లో పాతిపెట్టి..

Jul 4 2026 9:16 AM | Updated on Jul 4 2026 10:20 AM

Agra Woman Husband was Missing Police then found his body under Bathroom

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  సికంద్రా పరిధిలోని దహతోరా ప్రాంతంలో సురేంద్ర శర్మ (44) తన భార్య రూబీ శర్మ, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. వీరికి వివాహమై 16 ఏళ్లు పూర్తయింది. కాగా గత మే 26న సురేంద్ర శర్మ కనిపించకుండా పోయాడంటూ సికంద్రా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.

పోలీసుల దర్యాప్తులో రూబీ శర్మ ఒక పథకం ప్రకారం భర్తను హత్య చేసిందని తేలింది. ఘటన జరిగిన రోజున ఆమె తన ఇద్దరు కుమార్తెలను సురేంద్ర శర్మ పెద్దన్నయ్య ఇంటికి పంపించివేసింది. ఆ తర్వాత భర్తకు నిద్రమాత్రలు కలిపిన ఖీర్‌ను ఇచ్చింది. అది తిన్న సురేంద్ర శర్మ స్పృహ కోల్పోగానే, ఆమె అతడి గొంతు నులిమి హత్య చేసింది. మరుసటి రోజు ఉదయం, బాత్రూమ్‌లో ఒక గొయ్యి తవ్వి, అందులో భర్త శవాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ప్రదేశాన్ని సిమెంట్ ఫ్లోరింగ్‌తో పూర్తిగా కప్పివేసింది.

తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడని బంధువులను, పొరుగువారిని 45 రోజులుగా రూబీ నమ్మిస్తూ వచ్చింది. అయితే, సురేంద్ర శర్మకు సంబంధించిన ఒక పాత కేసుకు సంబంధించి రొటీన్ వెరిఫికేషన్ కోసం పోలీసులు ఇటీవల అతడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రూబీ శర్మ కంగారుపడుతూ, తన బావను (భర్త అన్నయ్యను) ఇంటికి పిలిపించింది.  పోలీసులు రూబీ శర్మను తమదైన శైలిలో విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించి శవాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించింది. పోలీసులు వెంటనే బాత్రూమ్ ఫ్లోరింగ్‌ను పగలగొట్టి, సురేంద్ర శర్మ మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆగ్రా హరిపర్వత్ సర్కిల్ ఏసీపీ అమీషా మీడియాతో మాట్లాడుతూ.. మే 26న సురేంద్ర మిస్సింగ్ కేసు నమోదైందని, విచారణలో భార్యే అతడిని హత్య చేసి బాత్రూమ్‌లో పూడ్చిపెట్టినట్లు తేలిందన్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

ఇది కూడా చదవండి: పాక్‌లో కలకలం: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల కోసం ‘మాయ’ స్మగ్లింగ్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement