బేతంచెర్ల: రెండేళ్ల టీడీపీ పాలనలో రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఆదివారం బేతంచెర్ల పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామా ల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఖరీఫ్ సీజన్‌లో ఎరువులు, విత్తనాలు అందించలేక పోయిందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్ రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఏటా పెట్టుబడి సాయం, ఆర్‌బీకేల ద్వారా సకాలంలో ఎరువుల సరఫరా, ఉచిత పంటల బీమా, దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పాలనలో పంటల బీమా ప్రీమియాన్ని కూడా రైతులే భరించాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలు తోపాటు మహిళను సైతం మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సిమెంట్ నగర్ గ్రామానికి చెందిన మహిళలు మాజీ మంత్రి బుగ్గనను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, బాబురెడ్డి, లక్ష్మీరెడ్డి, రామచంద్రుడు, మురళీకృష్ణ, మునేశ్వర్‌రెడ్డి, తిరుమలేశ్వర్‌రెడ్డి, పిట్టల జాకీర్, దస్తగిరి, మల్లికార్జున, గోపాల్‌రెడ్డి సలీమ్, వలిబాషా పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవడంలో
టీడీపీ ప్రభుత్వం విఫలం
పంటల బీమా ప్రీమియం
భారం మోపడం తగదు
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి


