నందికొట్కూరు: టీడీపీ నాయకులు బరితెగించారు. కుంటలను, చెరువులను కూడా వదలకుండా ఎర్రమట్టి తవ్వి అమ్మేస్తున్నారు. నందికొట్కూరు మండం అల్లూరు గ్రామ సమీపంలో జేసీబీలతో తవ్వకాలు చేపడుతున్నారు. రోజుకు ఆరు ట్రాక్టర్ల ద్వారా 70 ట్రిప్పులు తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ రూ. 1000 చొప్పున అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా మైనింగ్ అధికారులు స్పందించడం లేదు. కొనుగోలు చేసిన ఎర్రమట్టిని రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు వినియోగిస్తున్నారు.
అక్రమంగా తవ్వకాలు
నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సొంత ఊరిలోనే టీడీపీ నాయకులు జోరుగా అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఈ ఊర్లకుంటలో పడి ముగ్గురు పిల్లలు మృతిచెందిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కుంటలోని మట్టి తవ్వకుండా చుట్టూ కంచె వేయిస్తామని టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ కుంటను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. మరి ఎంతమంది పిల్లల ప్రాణాలను బలి చేయాలని చూస్తున్నారో అని ప్రజలు విమర్శిస్తున్నారు.
అనుమతులు లేకుండా..
ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టిని తరలించడమే కాకుండా బెదరింపులకు పాల్పడటమేమిటని అల్లూరు గ్రామ ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఊర్లకుంట నుంచి రహదారి నిర్మాణాలకు సారవంతమైన ఎర్ర మట్టిని తరలించి అమ్ముకుంటున్నారని తెలిపారు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే ట్రాక్టర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే
ఊరి సమీపంలో అక్రమ తవ్వకాలు
ఒక ట్రాక్టర్ ఎర్ర మట్టి రూ.1000
చొప్పున విక్రయం
చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు


