సాగు విధానాలు ఇలా..
ఉత్పాదకత పెంపే లక్ష్యంగా కొత్త పథకం అమలు
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ
● రైతులకు ప్రోత్సాహకం కోసం
ఉచితంగా విత్తనాల పంపిణీ
● జిల్లాలో 6,130 హెక్టార్లలో సాగుకు 72 వేల పాకెట్లు అందజేత
● పథకం అమలు కోసం
రూ.9.46 కోట్లు కేటాయింపు
కల్వకుర్తి: పత్తి పంట దిగుబడిని పెంచి రైతుకు మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకవచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ పథకం అమలు చేస్తున్నారు. 2026 నుంచి 2031 వరకు ఐదేళ్లపాటు పథకాన్ని అమలు చేసి రైతుల్లో సాగు విధానంలో సరికొత్త పద్ధతులపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలున్నా యి. ప్రస్తుత సాగు విధానంతో ఎకరాకు 6– 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వస్తుంది. కొత్త సాగు విధానాలతో మొక్కల పెంపకం అధికంగా చేస్తే దిగుబడి అధికమవడంతోపాటు రెండో పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వ్యవసాయాధికారులు అభిప్రాయపడుతున్నారు.
మరో నాలుగేళ్లపాటు..
జిల్లాలో ఈ ఏడాది పథకం అమలు కోసం రూ.9.46 కోట్లు కేటాయించారు. ఈ విధంగా మరో నాలుగేళ్లపాటు (2031 వరకు) పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొల్లాపూర్ డివిజన్ మినహాయించి మిగతా 16 మండలాల్లో 6,130 హెక్టార్లలో ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా పత్తి పాకెట్లు అందించి కొత్త పద్ధతుల్లో సాగు చేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం 72 వేల పత్తి పాకెట్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఏఈఓలు రైతు వేదికల్లో రైతులకు పత్తి పాకెట్లు దాదాపుగా అందజేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రైతులు పత్తి సాగు విధానం వల్ల కేవలం ఎకరానికి 6–7 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తుందని అంచనా. విత్తు విత్తే విధానం వల్ల కేవలం హెక్టారుకు 15– 20 వేల మొక్కలు మాత్రమే వస్తాయి. దీంతో దిగుబడి తక్కువ రావడంతోపాటు మూడు, నాలుగు పర్యాయాలు పంటను తీస్తారు. ఫలితంగా దిగుబడి తక్కువతోపాటు రెండో పాటు వేరుశనగ, మొక్క జొన్న ఇతరత్రా పంటలు వేసుకోవడానికి ఆలస్యమవుతుంది.
అధిక సాంధ్రత పద్ధతి (హెచ్‌డీపీఎస్)లో 90:15 సెం.మి., విధానంలో విత్తనాలు విత్తాలి. ఇందుకు ఎకరానికి ఆరుపాకెట్లు అవసరమవుతాయి. హెక్టారుకు దాదాపు 74 వేల మొక్కలు పెరుగుతాయి.
క్లోజర్ స్పేసింగ్ (సిఎస్) పద్ధతిలో 90:30 సెం.మి., నాలుగు పాకెట్ల విత్తనాలు సరిపోతాయి. హెక్టారుకు 37 వేల మొక్కలు వస్తాయి. మొక్కలు అధికంగా ఉండటం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది. ఎకరానికి 12–14 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా. ఈ కొత్త విధానం వల్ల ఒకేసారి పత్తి దిగుబడి వస్తుంది. పంట తీయడానికి సులువుగా ఉండటంతోపాటు పంటకాలం ఒకేసారి ముగిసిపోతుంది. దీంతో రైతులు సకాలంలో రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు.


