రేషన్ లబ్ధిదారులకు 31వ తేదీ వరకు గడువు
● జిల్లాలో 6,94,740మంది ఈ–కేవైసీ పూర్తి
● మరో 2,04,445 మంది ఫిజికల్‌గా రేషన్ దుకాణానికి వెళ్లాల్సిందే..
● త్వరలో స్మార్ట్‌కార్డులు అందజేత
కల్వకుర్తి: బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం ఈ–కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ప్రారంభంలో వేగంగా కొనసాగిన ఈ ప్రక్రియ.. కొన్నాళ్ల తర్వాత అధికారులపై ఒత్తిడి తగ్గించడంతో నిర్లక్ష్యం నెలకొంది. దీంతో ఎంతోమంది లబ్ధిదారుల ఈ–కేవైసీ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో ఇప్పటివరకు 77.26 శాతం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయింది. తద్వారా చాలా బోగస్ కార్డులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మరణించి వారి పేర్లను రేషన్ కార్డుల్లో నుంచి తొలగించారు. పూర్తిస్థాయిలో ఈ ప్రక్రియ చేపడితే మరిన్ని బోగస్ కార్డులు, మరణించిన వారి సంఖ్య తేలనుంది. మిగిలిన లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీ వరకు రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ–కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం గడువు విధించింది.
ముందుంజలో కల్వకుర్తి..
జిల్లాలో కల్వకుర్తి మండలం రేషన్ ఈ–కేవైసీలో మందంజలో ఉంది. మండలంలో 66,140 యూనిట్లు ఉండగా.. 52,400 మంది ఈ–కేవైసీ పూర్తయింది. ఇంకా 13,740 మంది మిగిలారు. రెండో స్థానంలో నాగర్‌కర్నూల్ మండలం ఉంది. ఇక్కడ 77,326 యూనిట్లకు గాను 59,378 మంది ఈ–కేవైసీ నమోదు చేసుకున్నారు. కొల్లాపూర్ మండలంలో 61,264 యూనిట్లకు గాను 46,613, అచ్చంపేట మండలంలో 66,147 యూనిట్లకు గాను 49,679 యూనిట్ల ఈ–కేవైసీ పూర్తయింది.
ఇక స్మార్ట్ కార్డులే..
జిల్లాకు రేషన్ స్మార్ట్ కార్డులు వచ్చాయి. లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అయితే ప్రింట్ పేపర్ కాకుండా, ఓటరు కార్డు తరహాలో రేషన్ స్మార్ట్ కార్డు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కార్డుపై క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యులు, సంబంధిత రేషన్ దుకాణం వివరాలు వస్తాయి.కార్డు స్థితి వంటి సమాచారం తెలిసిపోతుంది. భవిష్యత్‌లో సంక్షేమ పథకాలకు సైతం అనుసంధానం చేసే అవకాశం ఉంది.


