నాన్నకు ప్రేమతో.. | Upcoming Father Sentiment Movies Updates in Tollywood | Sakshi
Sakshi News home page

నాన్నకు ప్రేమతో..

Jun 21 2026 12:45 AM | Updated on Jun 21 2026 8:10 AM

Upcoming Father Sentiment Movies Updates in Tollywood

నాన్న అంటే ఓ భావోద్వేగం... నాన్న అంటే నమ్మకం... నాన్న అంటే భరోసా... నాన్న అంటే సూపర్‌ హీరో... నాన్న అంటే ప్రేమకు నిర్వచనం... ఆ ప్రేమ అనంతం..  అందుకే సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా ఫాదర్‌ ఎమోషన్‌ ఎవర్‌ గ్రీన్‌. వర్కౌట్‌ అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ కాసులు వర్షం కురిపిస్తారు. అందుకే ఫాదర్‌ ఎమోషన్‌తో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా ఉంది. మరి... ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఫాదర్‌ ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న సినిమాలపై ఓ లుక్‌ వేయండి.

ఫాదర్‌ కాకాజీ 
చిరంజీవి ‘డాడీ’ సినిమా గుర్తుందిగా..! ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్‌ బాండింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కంటే ముందు చిరంజీవి హీరోగా నటించిన ‘చక్రవర్తి’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ వంటి చిత్రాల్లో తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ భావోద్వేగభరితంగానే సాగుతుంది. ఇక చిరంజీవి హీరోగా నటించిన గత చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’లోనూ ఫాదర్‌–డాటర్‌ ఎమోషనల్‌ సీక్వెన్స్‌ ఆడియన్స్‌ను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జానర్‌లో మరో సినిమాను ఓకే చేశారట చిరంజీవి.

‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్‌ సినిమా తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు కేఎస్‌ రవీంద్ర కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ సినిమా ‘చిరు158’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషనల్‌ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉంటాయని తెలిసింది. కథలో చిరంజీవి, అనశ్వర రాజన్‌ తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారని టాక్‌. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.

తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ను హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్‌ను పొల్లాచ్చిలో పూర్తి చేశారు. తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలైందని తెలిసింది. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో సాగుతుందని, హీరో క్యారెక్టరైజేషన్స్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణను త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌  ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్‌.

కూతురు కోసం..! 
కూతురు కోసం ఎందాకైనా వెళ్లడానికి సిద్ధమయ్యారు హీరో నాగార్జున. ఏం చేశారు? అనేది ‘కింగ్‌ 100’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో చూడొచ్చని తెలిసింది. నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘కింగ్‌ 100’. ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని తెలిసింది. నాగార్జున కెరీర్‌లోని ఈ 100వ సినిమాలో టబు, సుష్మితా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టెక్నాలజీ సాయంతో పాతికేళ్ల వయసు ఉన్న వ్యక్తిగా నాగార్జున కనిపించనున్నట్లు తెలిసింది.

ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఈ దసరాకు రిలీజ్‌ చేయాలని మేకర్స్‌  ప్లాన్‌ చేశారు. అయితే సంక్రాంతికి రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉన్నారట. అంతేకాదు... ఈ ‘కింగ్‌ 100’ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు కూడా నటిస్తారని తెలిసింది. అయితే ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నాగార్జున హీరోగా నటించిన ‘ఆఫీసర్‌’ చిత్రంలో తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ ఉన్న విషయం ఆ సినిమా చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది.

ఇరుముడి 
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న రిలీజ్‌ కానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ చిత్రం ప్రధానంగా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని ఈ టీజర్‌ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో రవితేజ కుమార్తెగా చైల్డ్‌ ఆర్టిస్టు నక్షత్ర నటిస్తోంది.

రవితేజ భార్యగా ప్రియాభవానీ శంకర్‌ నటిస్తున్నారు. అజయ్‌ ఘోష్, రమేష్‌ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్‌ కంచెర పాలెం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... రవితేజ హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘విక్రమార్కుడు’లో మంచి ఫాదర్‌–డాటర్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయిన సంగతి తెలిసిందే.

ఇటు స్పిరిట్‌... అటు సలార్‌... 
దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సూపర్‌ హిట్‌ సినిమాలు ‘అర్జున్‌ రెడ్డి, యానిమల్‌’. ఈ రెండు చిత్రాల్లోనూ అంతర్లీనంగా ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్‌ ఉంటుంది. ఈ తరహా ఎమోషనల్‌ బాండింగ్‌ సందీప్‌ తాజా చిత్రం ‘స్పిరిట్‌’లోనూ కనిపించనుందని తెలిసింది. ప్రభాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్, ప్రకాష్‌రాజ్‌ తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని భోగట్టా.

ప్రకాష్‌రాజ్‌ సైతం పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలోనే కనిపిస్తారని తెలిసింది. భూషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా, క్రిషణ్‌కుమార్, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్న ‘స్పిరిట్‌’ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్‌ కానుంది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్‌ ఓబెరాయ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా ‘సలార్‌’. ఈ సినిమా నుంచి తొలి భాగం ‘సలార్‌ పార్ట్‌ 1: సీజ్‌ఫైర్‌’వచ్చింది. ఈ చిత్రంలో దేవ పాత్రలో నటించారు ప్రభాస్‌.

తొలి భాగంలో ప్రభాస్‌ తండ్రి పాత్ర గురించి పెద్దగా ప్రస్తావన లేదు. కానీ రెండో భాగంలో దేవ తండ్రి ధారా ప్రస్తావన పెద్ద స్థాయిలో ఉంటుందని తెలిసింది. సలార్‌ రెండో భాగం ‘సలార్‌: శౌర్యాంగపర్వం’లో దేవ–ధారాల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ సినిమాలో హైలైట్‌గా ఉంటాయని తెలిసింది. వచ్చే ఏడాది ‘సలార్‌ 2’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తండ్రి డ్రాగన్‌ అయితే కొడుకు లూగర్‌?
ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘డ్రాగన్‌’. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో డ్రాగన్, లూగర్‌... ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారని, కథ రీత్యా సినిమాలో డ్రాగన్, లూగర్‌లు తండ్రీ కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్‌ కపూర్, అన్షుమాన్, సిద్ధాంత్‌ గుప్తా, బిజు మీనన్, ఖుష్బూ, రాజీవ్‌ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 11న విడుదల కానుంది. 

ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దేవర, వర... ఇలా తండ్రీకొడుకుల పాత్రల్లో నటించారు ఎన్టీఆర్‌. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర 2’ రూపొందనుంది. ‘దేవర’ని నిర్మించిన కల్యాణ్‌ రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ రెండో భాగాన్ని కూడా నిరిస్తారని చెప్పోచ్చు.

తండ్రి... ఇద్దరు కొడుకులు! 
అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఇందులో తండ్రి, ఇద్దరు కొడుకులు... ఇలా మూడు పాత్రల్లోనూ అల్లు అర్జున్‌ నటిస్తున్నారని తెలిసింది. ఇలా అల్లు అర్జున్‌ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. దీపికా పదుకోన్, మలయాళ నటి ఫెమీనా జార్జ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్, మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్నా కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని తెలిసింది. ఈ ‘రాక’ చిత్రంలో రష్మిక, అల్లు అర్జున్‌ల క్యారెక్టరైజేషన్స్‌లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా 2027 డిసెంబరులో రిలీజ్‌ అవుతుందనే ప్రచారం సాగుతోంది.

ఇతర భాషల్లో రూపొంది, తెలుగు తెరకూ రానున్న కొన్ని చిత్రాల్లోనూ తండ్రి ఎమోషన్‌ ప్రధానాంశంగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే... 
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ హీరోగా నటించిన సినిమా ‘జన నాయగన్‌’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్‌ చిక్కుల వల్ల విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానాంశంగా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ ‘జన నాయకుడు’ ఉండబోతున్నట్లు ట్రైలర్‌లోని విజువల్స్‌ స్పష్టం చేస్తున్నాయి.

ఈ సినిమాలో విజయ్, మమితా బైజు తండ్రీ కుమార్తెలుగా నటించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, ప్రియమణి, నాజర్, సునీల్, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో వెంకట్‌ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా రిలీజ్‌ పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు సూపర్‌ హిట్‌ సినిమా ‘భగవంత్‌ కేసరి’ ఆధారంగా ‘జన నాయకుడు’ సినిమా తీశారనే వార్తలు ఉన్నాయి. ‘భగవంత్‌ కేసరి’ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రీలీల తండ్రీ కూతుళ్లుగా నటించారు. 

సూర్య హీరోగా నటించిన తాజా సినిమా ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. ఇదో ఫాదర్‌ ఎమోషన్‌తో అల్లుకున్న సినిమా కథ అని టైటిల్‌ స్పష్టం చేస్తోంది . ‘సార్, లక్కీ భాస్కర్‌’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

విజయ్‌ ప్రకాష్‌ తండ్రి సర్దార్‌. సమాజం నిందిస్తున్నట్లు తన తండ్రి ఓ దేశద్రోహి అనే భావనలో ఉంటాడు పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌ప్రకాష్‌. కానీ సర్దార్‌ ఒక ఇండియన్‌ స్పై ఏజెంట్‌ అని, నిజమైన దేశభక్తుడు అని విజయ్‌ప్రకాష్‌ ఆ తర్వాత తెలుసుకుంటాడు. తండ్రి బాటలోనే తాను ఇండియన్‌ స్పై ఏజెంట్‌గా మారతాడు. మరి... నెక్ట్స్‌ ఏం జరిగింది? అంటే ‘సర్దార్‌’ సినిమాలో చూడాలి. విజయ్‌ప్రకాష్, సర్దార్‌... ఇలా కార్తీ  ద్విపాత్రాభినయం చేసిన తమిళ సినిమా ‘సర్దార్‌’. 2022లో విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రదర్శకుడు పీఎస్‌ మిత్రన్, హీరో కార్తీ కలిసి ‘సర్దార్‌2’ సినిమాని కూడా పూర్తి చేశారు. ఈ సినిమా ఈ దీపావళికి రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. ఎస్‌జె సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

షారుక్‌ ఖాన్, ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న హిందీ సినిమా ‘కింగ్‌’. నిజ జీవితంలో తండ్రీ కూతుళ్లైన షారుక్, సుహానా ఖాన్‌ ‘కింగ్‌’ సినిమాలోనూ ఫాదర్‌–డాటర్‌ రోల్స్‌లో నటిస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌ విలన్‌గా నటిస్తుండగా రాణీ ముఖర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కింగ్‌’ సినిమా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్‌ కానుంది. అలాగే ఇది సుహానా ఖాన్‌ నటిస్తున్న తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ కావడం విశేషం. సిల్వర్‌ స్క్రీన్‌పై తన డెబ్యూ మూవీలోనే తండ్రితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అంటే ఏ కుమార్తెకు అయినా ఇంతకంటే స్పెషల్‌ ఏం ఉంటుంది? నిజంగా యాక్టర్‌గా సుహానా లక్కీ అని చెప్పవచ్చు.

ఆహార కల్తీ అనేది చిన్నారుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అన్న అంశం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. కూతురి ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ తండ్రి చేసిన అసాధారణమైన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో శ్రేయాస్‌ తల్పాడే నటించగా, న్యాయవాది పాత్రలో కాజల్‌ అగర్వాల్‌ నటించారు. చేతన్‌ డీకే దర్శకత్వంలో సాగర్‌ బి. షిండే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మించారు. ఈ చిత్రం జూలై 24న రిలీజ్‌ కానుంది. స్వాతి వినాయక్‌ సైందానే, అనితా జాధవ్, వినాయక్‌ సైదానే, కల్పేష్‌ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్‌ జోషిలు సహ–నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి సంగీతం: మంగేష్‌ ధాక్డే. 

కుమార్తెకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఏదైనా మంచి బహుమతి ఇస్తాడు? కానీ ఓ తండ్రి తన కుమార్తె చేతికి గన్‌ ఇచ్చాడు. ఎవర్నో చంపిన తర్వాత హ్యాపీ బర్త్‌ డే చెప్పాడు. నిజంగా అతను ఆమెకు తండ్రేనా? లేక తండ్రిలా ఆ అమ్మాయిని పెంచి, తన స్వార్థం కోసం వినియోగించుకుంటున్నాడా? అనేది హిందీ సినిమా ‘ఆల్ఫా’లో చూడాలి. ఆలియా భట్, శార్వరి, బాబీ డియోల్, అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఆల్ఫా’. వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ సినిమా జూలై 3న రిలీజ్‌ కానుంది. శివ్‌ రావైల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు.

– ముసిమి శివాంజనేయులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement