ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ | OTT Super Subbu Web Series Review Telugu And Rating, An Engaging Comedy That Tackles Sensitive Topics | Sakshi
Sakshi News home page

Super Subbu Review: సందీప్ కిషన్ 'సూపర్ సుబ్బు' ఎలా ఉందంటే?

Jul 3 2026 9:45 AM | Updated on Jul 3 2026 9:45 AM

Super Subbu Review Telugu And Rating

ఓటీటీలు చూసే చాలామందికి సినిమాలతో పాటు సిరీస్‌లు కూడా అలవాటే. కాకపోతే హారర్ లేదా థ్రిల్లర్ జానర్‌లో ఎక్కువగా చూస్తుంటారు. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఆధారంగా చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. అలాంటి సున్నితమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని తీసిన తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బు'. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. నెట్‌ఫ్లిక్‌లో తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతి ఏంటి? ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

కథేంటి?
సుబ్రమణ్యం అలియాస్ సుబ్బు(సందీప్ కిషన్).. సికింద్రాబాద్‌లోని గవర్నమెంటు స్కూల్‌లో ల్యాబ్ అసిస్టెంట్‌గా కాంట్రాక్ పద్ధతిలో పనిచేస్తుంటాడు. ఇతడి నాన్న కుక్కుటేశ్వరరావు(మురళి శర్మ).. హెడ్ మాస్టర్‌గా చేసి రిటైర్ అవుతాడు. అయితే తండ్రి దృష్టిలో సుబ్బు ఓ పనికిరాని వెధవ. కొన్ని కారణాల వల్ల సుబ్బు.. ఆదిలాబాద్‌లోని మాకిపూర్ అనే పల్లెటూరికి సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా వెళ్లాల్సి వస్తుంది. ఈ విషయం ఇంట్లో వాళ్లకి, పెళ్లి చేసుకోబోయే దివ్య(మానస చౌదరి)కి తెలియకుండా దాచిపెడతాడు. అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే తెలియని పల్లెటూరి జనానికి.. సుబ్బు ఇవన్నీ చెప్పగలిగడా? సుబ్బు ఇంట్లో వాళ్ళకు ఇదంతా ఎప్పుడు తెలిసింది? సుబ్బుని ప్రేమించిన స్వాతి(మిథిలా పాల్కర్)ఎవరు? చివరకు ఏమైంది అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
హస్త ప్రయోగం, కండోమ్, యోని, ఫ్యామిలీ ప్లానింగ్, వేసక్టమీ, శానిటరీ ప్యాడ్, పునరుత్పత్తి వ్యవస్థ, ఎయిడ్స్ గురించి, ఆడపిల్లలు-మగపిల్లలు పుట్టడం, నెలసరి.. ఈ పదాలు వినగానే అవేదో బూతు అన్నట్టు ఇప్పటికీ చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. బయటకు ఇదంతా మాట్లాడుకూడదు అనే అనుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే నగరాల్లో వీటన్నింటిపై అందరికీ అవగాహన పెరుగుతోంది. కానీ పల్లెటూళ్లలో మాత్రం ఇప్పటికీ వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం పెద్దగా చేయరు. అలాంటి సెన్సిటివ్ అంశం గురించి చెబుతూ తీసిన సిరీస్ ఇది.

సెక్స్ ఎడ్యుకేషన్ అన్నాం కదా అని ఇందులో మొత్తం అవే ఉంటాయి అని మాత్రం అనుకోవద్దు. తొలి రెండు ఎపిసోడ్స్‌లోనే ఇవన్నీ చూపించారు. మిగతా అంతా ఆ పల్లెటూరిలో సుబ్బు ఎలాంటి కష్టాలు పడ్డాడు? అక్కడి మగవాళ్ళు ఇతడిని ఎలా ఇబ్బంది పెట్టారు అని సాగుతుంది. కానీ సిరీస్ ఆద్యంతం ఫుల్ కామెడీ‌గా తీశారు. కాన్సెప్ట్‌కి తగ్గట్టే కంప్యూటర్, పెన్ డ్రైవ్ లాంటి పదాలతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్నిచోట్ల వినిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో బూతు లేకుండానూ చెప్పే ప్రయత్నం చేశారు.

ఓ సీన్‌లో మగపిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? అని ఊరి ఆడవాళ్లు.. సుబ్బు పాత్రని అడుగుతారు. వారికి 'ఎక్స్' క్రోమోజోములు, 'వై' క్రోమోజోములు అని సిటీలో చెప్పినట్టుగా చెబితే అర్థం కాదు. అలాంటి విషయాన్ని రెండు పూల కుండీలను తీసుకుని ఇందులో ఉన్నది ఒకటే మట్టి కానీ ఒక దాంట్లో ఒక పూల చెట్టు ఇంకో దాంట్లో ఇంకో పూల చెట్టు ఉంది ఎందుకు? అని అడుగుతాడు. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం మొలకెత్తుతుంది అని మహిళలంతా చెబుతారు. మరి మట్టిని తిడితే ఏం లాభం ఉంటుంది అని అందరికీ అర్థమయ్యేలా సుబ్బు చెబుతాడు.

మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా తీసిన ఈ సిరీస్‌లో కాన్సెప్ట్ వినగానే అసభ్యంగా అనిపిస్తుంది గానీ ఎక్కడ ఆ ఛాయలు లేకుండా చాలా జాగ్రత్తగా తీశారు. పల్లెటూరు, అందులో ఉండే మనుషులు.. సెక్స్ అనే దాని పట్ల వాళ్ళకు ఉండే అవగాహన.. మగ పిల్లాడు కోసం పిల్లల్ని కంటూనే ఉండటం, కండోమ్ వాడటం అంటే ఏదో మహాపాపం అన్నట్టు ఫీల్ అయిపోవడం. ఆడవాళ్లకి కూడా దీనిపై కనీస అవగాహన లేకపోవడం లాంటి ఆసక్తికర విషయాలని కామెడీగా చూపించడం బాగుంది. బాగా ప్రెజంట్ చేశారు కూడా. కాకపోతే సుబ్బు పాత్రకు తప్పితే మిగతా ఎవరికీ కనెక్ట్ అవ్వం. ఎందుకో ఆయా పాత్రలతో ఎందుకో ఎమోషన్ ఫీల్ కాలేకపోతాం. ఇక చివరి ఎపిసోడ్స్‌లో కథ కాస్త నెమ్మదించడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం చిన్న మైనస్.

ఓ సీన్ లో సుబ్బు.. అనుకోకుండా ఆ ఊరిలో వుండే రజినీ అనే వేశ్య ఇంటి వెళ్తాడు. ఆమెతో తన పరిస్థితి అంతా చెబుతాడు. ఆ టైమ్‌లో ఆమె.. 'నేను చేసే పని బూతు అంటారు కానీ అందులో నేను పని వెతుక్కుంటున్నా.. మీరేమో మీరు చేస్తున్న పనిలో బూతుని చూస్తున్నారు' అనే చెప్పే డైలాగ్ కానీ.. ఓసారి ఊరిలో ఆడవాళ్ళకి క్లాస్ చెప్తూ.. 'అందరికీ జన్మస్థానమైన ప్రదేశం శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గు ఎందుకు అమ్మా' అని శానిటరీ ప్యాడ్స్ ఉపయోగం గురించి చెప్పే డైలాగ్ గానీ సీన్‌కి తగ్గట్లు అనిపిస్తాయి.

సుబ్బు జీవితంలోకి మొదట వచ్చే దివ్య క్యారెక్టర్‌లో స్వార్ధం ఉంటే.. తర్వాత వచ్చే అమ్మాయి క్యారెక్టర్‌లో ట్విస్టులు బాగుంటాయి. స్వాతి క్యారెక్టర్ అయితే సబ్బుతో ప్రేమలో పడి, కలిసి ఒక్కటయ్యేవరకు వెళ్తుంది. ఈమె పాత్రలో క్యూట్‌నెస్, ఇన్నోసెన్స్, డేరింగ్ లాంటివి కనిపిస్తాయి. అయితే సుబ్బుని జీవితాంతం ప్రతి దానికి భయపెడుతూ, ఒక నిస్సహాయుడుగా చేసేస్తాడు అతడి తండ్రి. చివరకు దాన్ని ఎలా అధిగమించాడనేది ఇందులో ఉంటుంది. ఈ సీన్స్ చాలామంది కుర్రాళ్లకి కనెక్ట్ అవుతాయి.

ఎవరెలా చేశారు?
యాక్టింగ్ విషయానికి వస్తే సుబ్బుగా సందీప్ కిషన్ అదరగొట్టేశాడు. ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. చాలా సహజంగా అనిపిస్తుంది. మురళీ శర్మ చేసిన కుక్కుటేశ్వరరావు పాత్ర ఇరిటేషన్ తెప్పిస్తుంది. దివ్య చేసిన మానస చౌదరి ఓకే. స్వాతిగా చేసిన మిథిలా పాల్కర్ మాత్రం చాలా నచ్చేస్తుంది. సంపూర్ణేష్ బాబు ఉన్నాడు. ఉన్నంతలో కామెడీ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. హీరో పక్కనే ఉండే గెటప్ శ్రీను పాత్ర కూడా పర్లేదు. బ్రహ్మానందం రెండు మూడు సీన్స్‌లో కనిపించారు. వేశ్యగా దివ్య పిళ్ళై కనిపించేది కాసేపు అయినా ఇంపాక్ట్ చూపిస్తుంది.

రైటర్-డైరెక్టర్ మల్లిక్ రామ్.. సెక్స్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ తీసుకున్నప్పటికీ దాన్ని లైట్ హార్టెడ్ కామెడీగా చూపించి చెప్పడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీకి తగ్గట్టు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఓటీటీలో ఏదైనా కామెడీ‌గా చూద్దామనుకుంటే ఈ సిరీస్ ట్రై చేయండి. అసభ్యకర సీన్స్ ఏం లేవు గాని అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా 18 ప్లస్ కంటెంట్ కాబట్టి ఒంటరిగానే చూడండి.

-చందు డొంకాన 

(ఇదీ చదవండి: ‘ఇసకపట్నం’ వెబ్‌సిరీస్‌ రివ్యూ)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement