మెగా హీరో రామ్ చరణ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. కొన్నాళ్ల క్రితం 'పెద్ది' మూవీతో వచ్చిన చరణ్.. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఓ న్యూస్ ఛానెల్ సమ్మిట్‌లో పాల్గొన్నాడు. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ రావడంలో ఓటీటీ పాత్ర ఎంతో కీలకం అని, 'పెద్ది'కి రూ.450 కోట్లు వసూళ్లు వచ్చిన సంగతి కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఇదే కార్యక్రమంలోనే మాట్లాడుతూ థియేటర్లలో అమ్మే పాప్‌కార్న్ ధరలు తగ్గించాలని సూచించడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష.. ఏమైంది?)
యాంకర్ ప్రశ్నకు రామ్ చరణ్ బదులిస్తూ.. భారతదేశంలో సినిమానే అత్యంత చవకైన వినోద సాధనమని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆస్వాదించగలిగే మంచి అనుభవాల్లో ఇదొకటని పేర్కొన్నాడు. అయితే థియేటర్ అనుభవం మరింత మెరుగ్గా ఉండాలంటే మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్, తినుబండారాల ధరలు తగ్గిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే మూడు వారాల క్రితం వచ్చిన 'పెద్ది' సంగతే తీసుకుంటే భారీ బడ్జెట్ పెట్టారని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. ఇలా చేస్తూ సినిమాని చవకైన ఎంటర్‌టైన్‌మెంట్ అనడం రియాలిటీకి దూరంగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే 'పెద్ది' లాంటి భారీ సినిమాలు వచ్చినప్పుడు బెనిఫిట్ షోలు, తొలి వారం ప్రీమియం రేట్లతో అమ్మే టికెట్లు, మల్టీప్లెక్స్ ఛార్జీలు, తినుబండారాల ఖర్చులు కలిపి చూస్తే ఓ సాధారణ కుటుంబం థియేటర్‌కు వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు.
మ్యూజిక్ కన్సర్ట్స్, క్రికెట్ మ్యాచుల్లాంటి వాటితో పోలిస్తే థియేటర్లలో సినిమా టికెట్ రేట్లు తక్కువగానే ఉండొచ్చు కానీ ఏడాది పాటు ఓటీటీలకు చేసే సబ్‌స్క్రిప్షన్స్ మూవీస్ టికెట్ రేట్లతో పోలిస్తే మరింత చవక. అందుకే ఒకప్పటితో పోలిస్తే చాలా కుటుంబాలు.. కొన్ని సినిమాల్ని థియేటర్లకు వెళ్లి చూడటం కంటే ఓటీటీలోకి చూసుకోవచ్చులే అనుకునే పరిస్థితికి వచ్చేశాయి. దీంతో చిన్న చిత్రాల సంగతి దారుణంగా తయారైంది. ఏదైతేనేం రామ్ చరణ్ కామెంట్స్ వల్ల మరోసారి టికెట్ ధరలు, మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్ రేట్లు మరోసారి హాట్ టాపిక్ అయిపోయాయి.
(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్)
If popcorn prices come down a bit, it would be better.
— #RamCharan pic.twitter.com/ergLRw2gwF— cinee worldd (@Cinee_Worldd) June 22, 2026


