ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణేశ్(41) అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా గణేశ్ విధులకు వచ్చారు. డ్యూటీలో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. తోటి పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సల్మాన్‌కు భద్రత ఎందుకంటే..
గతంలో సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. మరోపక్క 1990లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రీకరణ సమయంలో కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కూడా బిష్ణోయ్ బృందం కఠినంగా ఉన్నట్లు చెబుతుంటారు. 2024లో సల్మాన్ నివాసమైన బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెట్స్ వద్ద కాల్పులు చేటుచేసుకున్నాయి. దీంతో అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నా భద్రత.. దేవుడి చేతుల్లోనే..
తనకు వస్తున్న బెదిరింపులు, ఏర్పాటు చేసి బందోబస్తుపై సల్మాన్‌ఖాన్ గతంలో మాట్లాడుతూ..‘ భారీ భద్రత మధ్య జీవించడం, బయటకు వెళ్లి రావడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బెదిరింపులకు నేను బయపడను. నా భద్రత అంతా దేవుడి చేతుల్లోనే ఉంటుంది’ అని అన్నారు.


