బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ మూవీ వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా మెప్పించింది. పాకిస్తాన్ వెళ్లిన ఇండియన్ స్పై నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు భాగాలు ఈ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులకు నామినేషన్స్ దక్కించుకోలేకపోయింది. ఈ మూవీ సౌండ్‌ట్రాక్ విభాగంలో 2027 గ్రామీ అవార్డులలో నామినేషన్ పొందడంలో విఫలమైంది. మూవీలోని పాటల్లో ఏ ఒక్కటీ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఏకంగా తొమ్మిది విభాగాల్లో దురంధర్-2కు నిరాశే ఎదురైంది. అయితే ఇండియా నుంచి తమిళ పాట 'వరువాయి' ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. గ్రామీ నామినేషన్ పొందిన మొదటి తమిళ పాటగా ఘనత సొంతం చేసుకుంది.
దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన 'ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,363.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. కేవలం ఇండియాలోనే రూ. 1,013.15 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలోఉగ్రవాద నెట్‌వర్క్‌లోకి పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ గూఢచారి జస్కిరత్ సింగ్ రంగి పాత్రలో రణవీర్ సింగ్ (హమ్జా అలీ మజారీగా)నటించారు. ఈ గూఢచారి థ్రిల్లర్‌లోరాకేష్ బేడి, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, డానిష్ పాండోర్, సంజయ్ దత్, మానవ్ గోహిల్, గౌరవ్ గెరా కీలక పాత్రల్లో నటించారు.
ఇక 2027 గ్రామీ అవార్డుల్లో బ్రిటిష్ సింగర్ రే 11 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తర్వాతి స్థానంలో రోసాలా తొమ్మిది నామినేషన్స్ దక్కించుకుంది. ఎలా లాంగ్లీ, ఫోబ్ బ్రిడ్జర్స్, మిరాండా లాంబర్ట్, ఒలివియా రోడ్రిగో తలా ఏడు విభాగాల్లో నామినేషన్లు పొందారు. బ్రూనో మార్స్, లియోన్ థామస్, ఒలివియా డీన్ తలా ఆరు నామినేషన్లు సాధించారు. బియాన్స్ తన కెరీర్‌లో 100 గ్రామీ నామినేషన్లు సాధించిన మొట్టమొదటి కళాకారిణిగా చరిత్ర సృష్టించారు. ఆమె 'మార్నింగ్ డ్యూ (డాంక్)' పాటకు గాను ఉత్తమ ఆర్ అండ్ బి సోలో పెర్ఫార్మెన్స్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. దురంధర్-2 నుంచి ఎనిమిది పాటలు సమర్పించినప్పటికీ ఏ ఒక్కటీ అర్హత సాధించలేకపోయింది. కాగా.. 2027 గ్రామీ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్‌లోని క్రిప్టో.కామ్ ఎరీనాలో ఫిబ్రవరి 7న జరగనుంది.


