కొత్త విలన్‌ గురూ | new actors entering into villain roles in Tollywood | Sakshi
Sakshi News home page

కొత్త విలన్‌ గురూ

Sep 12 2025 3:24 AM | Updated on Sep 12 2025 3:25 AM

new actors entering into villain roles in Tollywood

తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించనున్నారు. ఈ విలన్లకు తెలుగు తెలియదు. అయినా ఫైట్‌ చేయడానికి భాషతో పనేం ఉంది? ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ పరభాష విలన్లు తమ నటనతో ప్రేక్షకులకు కొత్త విలనిజమ్‌ని పరిచయం చేయనున్నారు. ఇక తెలుగులో చేస్తున్న ఈ కొత్త విలన్స్‌ గురించి తెలుసుకుందాం.  

ఓజీ వర్సెస్‌ ఓమి  
బాలీవుడ్‌ పాపులర్‌ యాక్టర్‌ ఇమ్రాన్‌ హష్మి తెలుగు ఎంట్రీ ‘ఓజీ’ సినిమాతో ఖరారైంది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్‌ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ ఓజాస్‌ గంభీర (ఓజీ)గా నటించగా, విలన్‌ ఓమీ పాత్రలో ఇమ్రాన్‌ హష్మి నటించారు. డివీవీ దానయ్య, దాసరి కల్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌గా నటించగా, అర్జున్‌ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్‌ హష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఇమ్రాన్‌ విలన్‌గా నటిస్తున్నారని తెలిసింది.  

రామ్‌ బుజ్జిగా వస్తున్నాడు  
హిట్‌ వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్‌’లో మున్నాగా మంచి నటన కనబరిచారు దివ్యేందు శర్మ. ఈ పాపులర్‌ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులూ వీక్షించారు. ఈ ‘మిర్జాపూర్‌’ మున్నా ఇప్పుడు టాలీవుడ్‌కు వచ్చారు. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాలో దివ్యేందు శర్మ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. రామ్‌బుజ్జిగా దివ్యేందు కనిపిస్తారు. రామ్‌చరణ్‌ క్రికెట్‌ బ్యాటింగ్‌ – దివ్యేందు బౌలింగ్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.

అలాగే దివ్యేందు పాత్రలో కొంత నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని టాక్‌. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాల సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇక ‘మిర్జాపూర్‌’ సిరీస్‌తో పాటు ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ, 2016: ది ఎండ్, అగ్ని’ వంటి చిత్రాల్లో నటించారు దివ్యేందు. ఈ బాలీవుడ్‌ నటుడికి తెలుగులో ‘పెద్ది’ తొలి చిత్రం.  

వృషకర్మలో..  
సూపర్‌ హిట్‌ హిందీ చిత్రం ‘లాపతా లేడీస్‌’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్పర్ష్‌ శ్రీవాత్సవ్‌. ఈ బాలీవుడ్‌ యువ నటుడిని నాగచైతన్య తెలుగులోకి ఆహ్వానించారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్‌ అండ్‌ మిథికల్‌ మూవీ ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). ఈ చిత్రంలో స్పర్‌‡్ష శ్రీవాత్సవ్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. అయితే ‘లాపతా లేడీస్‌’లో పాజిటివ్‌ రోల్‌ చేసిన స్పర్‌‡్ష శ్రీవాత్సవ్‌ ‘వృషకర్మ’ చిత్రంలో మాత్రం నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారట. ‘విరూ పాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌. బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.  

పోటా  పోటీ  
బాలీవుడ్‌ యాక్షన్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘కిల్‌’ (2023)లో విలన్‌గా నటించి, ఆడియన్స్‌ను మెప్పించారు రాఘవ్‌ జూయల్‌. లక్ష్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్‌ విలనిజం యాక్షన్‌ ప్రియులకు కూడా కొత్తగా అనిపించింది. దీంతో రాఘవ్‌ జూయల్‌ పేరు బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ కాస్త గట్టిగానే వినిపించింది. అలా పాన్‌ ఇండియన్‌ మూవీ ‘ది  ప్యారడైజ్‌’లో నటించే అవకాశం రాఘవ్‌కు లభించింది. ‘దసరా’ వంటి హిట్‌ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ సినిమా ‘ది  ప్యారడైజ్‌’.

ఈ చిత్రంలో రాఘవ్‌ జూయల్‌ నటిస్తున్నట్లుగా ఆల్రెడీ చిత్రయూనిట్‌ స్పష్టం చేసింది. ఓ మెయిన్‌ విలన్‌ రోల్‌ని రాఘవ్‌ చేస్తున్నారని, నానీతో రాఘవ్‌కు  పోటా  పోటీ సన్నివేశాలు ఉంటాయని టాక్‌. ‘ది  ప్యారడైజ్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇక బాలీవుడ్‌లో ‘కిల్‌’తో పాటు ప్రభుదేవా ‘ఏబీసీడీ 2, సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’, సిద్ధాంత్‌ చతుర్వేది ‘యుద్ర’ వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచి, నార్త్‌ ఆడియన్స్‌ను అలరించారు రాఘవ్‌. మరి... టాలీవుడ్‌లోనూ రాణిస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.  

ఇన్‌స్పెక్టర్‌ స్వామి 
అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ సినిమా ‘డెకాయిట్‌’. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కెమెరామేన్‌ షానియల్‌ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, సునీల్‌తో పాటు బాలీవుడ్‌ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్‌ కశ్యప్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇన్‌స్పెక్టర్‌ స్వామి అనే పాత్రలో కనిపిస్తారు. అయితే కథ రీత్యా ఇన్‌స్పెక్టర్‌ స్వామి క్యారెక్టరైజేషన్‌లో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని ఫిల్మ్‌నగర్‌ సమచారం.

 అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలిసి ఓ క్రైమ్‌ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? అన్నదే క్లుప్తంగా ‘డెకాయిట్‌’ సినిమా కథాంశం.

డ్రాగన్‌తో  పోటీ! 
‘మిన్నల్‌ మురళి, 2018, ఏఆర్‌ఎమ్‌’ వంటి మలయాళ చిత్రాల్లో హీరోగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు టొవినో థామస్‌. కాగా, ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్‌’ సినిమాలో టొవినో థామస్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో టొవినో థామస్‌ చేస్తున్నది విలన్‌ రోల్‌ అని, ఆల్రెడీ ‘డ్రాగన్‌’ షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే ఈ సినిమా విదేశీ షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌తో పాటు ఈ చిత్రం కీలక తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది. రుక్మీణీ వసంత్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టీ సిరీస్‌ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్‌ 25న విడుదల కానుంది.

తెలుగులో విలన్స్‌గా చేస్తున్న నటీమణులూ ఉన్నారు..
బాలీవుడ్‌ నటి సోనాక్షీ సిన్హా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జటాధర’. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రంలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్‌ నేచురల్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్‌ పాత్రల్లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్‌ సిల్వర్‌ స్క్రీన్‌ పై కనిపించనున్న చిత్రం ఇది. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సమర్పణలో ఉమేష్‌ కుమార్‌ బన్సల్,  శివిన్‌ నారంగ్, నిఖిల్‌ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.  

హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్‌ ఆల్రెడీ కన్ఫార్మ్‌ అయ్యారు. హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే మృణాల్‌ గురించిన అధికారక ప్రకటన లేదు. అలాగే ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా  నటిస్తున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని, ఆమె విలన్‌ రోల్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఆగస్టులో విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్‌’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సుకుమార్‌ ఓ సందర్భంలో కన్ఫార్మ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మికా మందన్నా విలన్‌గా నటిస్తే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమా లవర్స్‌లో ఉండటం సహజం.

నెగటివ్‌ క్యారెక్టర్స్‌ చేయడానికి సీనియర్‌ హీరోలు సైతం చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున విలన్‌గా చేశారు. షారుక్‌ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ‘కింగ్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రంలో అభిషేక్‌ బచ్చన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ చిత్రంలో కమల్‌హాసన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు.

‘దోశె కింగ్‌’ అనే కొత్త చిత్రం కోసం మోహన్‌ లాల్‌ కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి విలన్‌ రోల్‌ చేశారు. అలాగే జితిన్‌ కే జోస్‌ డైరెక్షన్‌లోని మరో సినిమాలో మమ్ముట్టి విలన్‌ రోల్‌ చేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇలా... మరికొందరు సీనియర్‌ యాక్టర్స్‌ విలన్‌ రోల్‌ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

కెరీర్‌లో హీరోగా మంచి పీక్‌ స్టేజ్‌లో ఉన్న యంగ్‌ యాక్టర్స్‌ కూడా విభిన్నమైన విలన్‌ రోల్‌ వస్తే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించిన ‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌ విలన్‌గా నటించారు. హిందీలో ఎన్టీఆర్‌కు ఇది తొలి చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘భైరవం’ చిత్రంలో విలన్‌గా నటించారు మంచు మనోజ్‌. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్‌’లోనూ మనోజ్‌ ప్రతినాయకుడి పాత్ర  పోషించారు. 

మలయాళ దర్శక–నిర్మాత పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (బడే మియా చోటే మియా), ఫాహద్‌ ఫాజిల్‌ (పుష్ప 3), అర్జున్‌ కపూర్‌ (సింగమ్‌ ఎగైన్‌) వంటి చిత్రాల్లో విలన్‌ రోల్‌ చేశారు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ పృధ్వీరాజ్‌ విలన్‌గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్‌గా నటిస్తున్నారు జయం రవి. తెలుగు నటుడు సుహాస్‌ తమిళ చిత్రం ‘మండాడి’లో విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement