సుమంత్, ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్స్‌లో వచ్చిన మూవీ మహేంద్రగిరి వారాహి. ఈ సినిమాకు సంతోశ్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైంది. డివోషనల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా సినీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఈనెల 2వ తేదీ నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, వెన్నెల కిషోర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి, కమల్ కామరాజు కీలక పాత్రల్లో నటించారు. కాగా..ఈ చిత్రాన్ని బ్రిడ్జ్ ఫిలిమ్స్, రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు.
మహేంద్రగిరి వారాహి కథేంటంటే..
మహేంద్రగిరి రాజవంశస్థులకు ఓ శాపం ఉంటుంది. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగబిడ్డ 33వ పుట్టినరోజున మరణిస్తాడు. ఈ శాపం 200 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంటుంది. అలా 1993లో ఆ వంశంలో పుట్టిన రాజేంద్ర వర్మ(సిద్దు జొన్నలగడ్డ)మరణిస్తాడు. ఇక ఈ సారి రాజేంద్రవర్మ అల్లుడు, ఆ రాజవంశానికి వారసుడు నరేంద్ర వర్మ(వంశీ చాగంటి) కూడా మరణిస్తాడని పూజారులు చెప్తారు. కథలో ఇదో భాగం.. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్ సిద్ధు అలియాస్ సిద్ధార్థ్(సుమంత్)..దెయ్యాలు, దేవుళ్ల పేరుతో కొంతమంది జనాలను మోసం చేస్తున్నారనేది ఆధారాలతో బయటపెడుతుంటాడు. అతని పెరెంట్స్‌తో పాటు అన్నయ్య రాజీవ్(కమల్ కామరాజు) కూడా దేవుడిని నమ్ముతాడు.
పెళ్లి దోషం పోయేందుకు మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయంలో పూజలు చేయమని చెప్పడంతో, రాజీవ్ తన బర్త్‌డే రోజు ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో నరేంద్ర వర్మ కూడా ఆలయానికి వస్తాడు. మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో గుడి ముందే ఉండే దున్నపోతు ఇద్దరినీ పొడిచి చంపేస్తుంది. సరిగ్గా 33వ పుట్టిన రోజు నాడే ఇది జరుగుతుంది. తన అన్న మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు సిద్ధు. ఈ క్రమంలో మహేంద్రగిరి రాజవంశం శాపం వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. అదేంటి? రాజవంశస్తులకు శాపం ఉంటే.. రాజీవ్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అసలు 200 ఏళ్ల క్రితం ఆ శాపం ఎలా వచ్చింది? ఇప్పుడు జరుగుతున్న మరణాలకు నిజంగా అమ్మవారి శాపమే కారణమా లేదా దాని వెనుక ఎవరైనా ఉన్నారా? సిద్ధార్థ్ రీసెర్చ్‌లో తెలిసిన అసలు నిజాలు ఏంటి? అనేదే మిగతా కథ.


