తీరని కలగానే మిగిలిపోయింది: సెలబ్రిటీల భావోద్వేగం | Khushbu Sundar Gets Emotional Over Director Bharathiraja Demise | Sakshi
Sakshi News home page

భారతీరాజా కన్నుమూత.. చిరంజీవి, ఖుష్బూ, రజనీల సంతాపం

Jun 10 2026 10:12 AM | Updated on Jun 10 2026 1:47 PM

Khushbu Sundar Gets Emotional Over Director Bharathiraja Demise

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా (84) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం (జూన్‌ 10న) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి పలువురు తారలు భారతీరాజా పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

వెలకట్టలేనిది
భారతీయ సినిమా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి వాసనను, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను భారతీరాజా తెరపై అందమైన కవిత్వంగా మలిచారు. ఆయన చిత్రాలు లక్షలాది హృదయాలను తాకాయి. ఎంతోమంది దర్శకనిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి.

పలు జాతీయ అవార్డులు అందుకున్న పద్మశ్రీ గ్రహీత భారతీరాజాగారు ఇండియన్‌ సినిమాకు అందించిన సేవలు వెలకట్టలేనిది. ఆయన దర్శకత్వంలో ఆరాధన మూవీలో పులిరాజుగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, అభిరుచి నాపై ఎంతో ప్రభావం చూపాయి. ఆయన మనతో లేకపోయినా ఆయన తీసిన సినిమాలు మన మధ్య ఎప్పటికీ నిలిచి ఉంటాయి. 'ఇయక్కునార్‌ ఇమయం' (దర్శక దిగ్గజం) భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇదే నా ప్రగాఢ సానుభూతి.
- చిరంజీవి

 

 

కలగానే మిగిలిపోయింది: ఖుష్బూ
మనందరికీ ఎంతో ఇష్టమైన లెజెండరీ దర్శకుడు భారతీరాజా ఇక లేరనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేశాయి. భవిష్యత్తులో రాబోయే చిత్రాలకు దిశానిర్దేశంగా పని చేస్తాయి. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం ఆయన గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపించాలని, కలిసి సినిమా చేద్దామని ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పుడది తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
- ఖుష్బూ

 

ఆయన శైలి ప్రత్యేకం : పవన్‌ కల్యాణ్‌
ప్రముఖ దర్శకులు భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా గారి కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
- పవన్‌ కల్యాణ్‌
నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి

ఒక శకం ముగిసింది: విశాల్‌
'భారతీరాజా గారితో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన మనల్ని విడిచి వెళ్లారన్న వార్త వినడం ఎంతో దిగ్భ్రాంతికరం. తమిళ సినిమా ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చిన దార్శనికుడు ఆయన. మన గ్రామాలు, ప్రజలు, భావోద్వేగాలలోని అంతరార్థాన్ని వెండితెరపై మరెవరూ చూపించలేనంత అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా, దశాబ్దాల తరబడి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసేలాంటి పాత్రలను అందించారు. ఆయన సినిమాలు ఎన్నో తరాల దర్శకులకు, నటులకు, సినీ ప్రేమికులకు స్ఫూర్తినిచ్చాయి. ఆయన సృష్టించిన ప్రతి ఫ్రేమ్ ద్వారా ఆయన వారసత్వం సజీవంగా నిలిచి ఉంటుంది.

సృజనాత్మక దర్శకులుగా తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకునే వారికి ఆయన కృషి ఒక నిదర్శనంగా, చలనచిత్ర నిర్మాణంలో ఒక 'బైబిల్' (మార్గదర్శి)గా నిలుస్తుంది. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. తమిళ సినిమా గొప్ప కథకులలో ఒకరిని కోల్పోయింది. మీతో కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ముఖ్యంగా #PandiyaNaadu చిత్రంలో తండ్రీకొడుకులుగా కలిసి పనిచేసినప్పుడు మీతో గడిపిన సమయం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది.

ఈ గొప్ప చిత్ర పరిశ్రమలో నేను కూడా ఒక భాగమేనన్న భావనను ఆ క్షణాల్లో మీరు నాకు కలిగించారు. ఎప్పుడూ ఉత్సాహభరితమైన చిరునవ్వుతో, యువకుడిలాంటి ఉత్సాహంతో మీరు వ్యవహరించిన తీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది' అని విశాల్‌ ట్వీట్‌ చేశారు. అలాగే దర్శకుడిగా తన మొదటి సినిమా టీజర్‌ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

 

గొప్ప పాఠాలు
హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగిన దర్శకుడా.. మీకు ముగింపు లేదు.. ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మీ పనితనం, సినిమాలే మాకు విలువైన పాఠాలు.
- కాయల్‌ దేవరాజ్‌

 

 

 

 

 చదవండి: దర్శకుడు భారతీరాజా కన్నుమూత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement