ఇంట్రెస్టింగ్ స్టోరీ.. ఐఏఎస్ అధికారిపై మాధవన్ ప్రశంసలు | R Madhavan Praises IAS Prathap Murugan | Sakshi
Sakshi News home page

R Madhavan: 1200 పాడుబడ్డ బోర్‌వెల్స్‌కి కొత్త జీవం.. ఈ స్టోరీ విన్నారా?

Jul 29 2026 9:18 PM | Updated on Jul 29 2026 9:18 PM

R Madhavan Praises IAS Prathap Murugan

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.. తన సోషల్ మీడియాలో ఓ స్ఫూర్తిదాయక నిజజీవిత కథని చెప్పారు. తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి ప్రతాప్ మురుగన్ చేపట్టిన వినూత్న జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రశంసించారు. తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రతాప్.. జిల్లాలో వేల సంఖ్యలో పాడుబడ్డ బోర్‌వెల్స్ గమనించారు. ఓవైపు రైతులు నీటి కోసం మరింత లోతుగా బోర్‌వెల్స్ తవ్వుతుంటే ఫలితం ఉండట్లేదు. మరోవైపు వర్షాకాలంలో భారీగా వర్షపు నీరు కాలువలు, డ్రైనేజీల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తోందని కలెక్టర్ గుర్తించారు.

(ఇదీ చదవండి: గురుపౌర్ణమి నాడు బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి)

దీనికి పరిష్కారంగా జిల్లాలోని 1200కు పైగా పాడుబడ్డ బోర్‌వెల్స్‌ని వర్షపు నీటి సంరక్షణ యూనిట్‌లుగా మార్చే ప్లాన్ అమలు చేశారు. ఇప్పటికే ఉన్న బోర్‌వెల్స్‌నే ఉపయోగించి వర్షపు నీటిని భూమిలోకి చేరేలా ఏర్పాటు చేశారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ప్రాజెక్టు అమలు చేయడంలో స్థానిక ప్రజలని కూడా భాగస్వాములని చేయడం విశేషం. ఇలా తక్కువ ఖర్చులోనే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.

తొలి వర్షాకాలం తర్వాతే ఈ ప్రాజెక్టు ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భూగర్భజలాల మట్టం ఐదు నుంచి పది అడుగుల వరకు పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. ఎన్నో ఏళ్లుగా ఎండిపోయిన బావుల్లో మళ్లీ నీరు చేరింది. పనిచేయని చేతి పంపులు తిరిగి పనిచేయడం మొదలుపెట్టాయి. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

విరుదానగర్ జిల్లాలోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన ప్రతాప్ మురుగన్.. చిన్నప్పటి నుంచే నీటి విలువను దగ్గర నుంచి తెలుసుకున్నారు. పెరిగి పెద్దయిన తర్వాత ఐఏఎస్‌గా ఈ కార్యక్రమాన్ని మరింత పక్కాగా అమలు చేయడంలో విజయం సాధించారు. ఇక మాధవన్ ప్రశంసలతో ప్రతాప్ మురుగన్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. 

(ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ బోల్డ్ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement