సినీ దిగ్గజం భారతీరాజా కన్నుమూత | Tamil Director Bharathiraja Passed Away | Sakshi
Sakshi News home page

సినీ ఇండస్ట్రీలో విషాదం.. భారతీరాజా కన్నుమూత

Jun 10 2026 7:58 AM | Updated on Jun 10 2026 9:03 AM

Tamil Director Bharathiraja Passed Away

సినీ దిగ్గజం భారతీరాజా (84) ఇక లేరు. అనారోగ్యంతో బుధవారం వేకువజామున ఆయన కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. భారతీరాజా మృతితో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

ఒకప్పుడు భారతీయ సినిమాల్లో పల్లె అంటే స్టూడియోలో వేసిన సెట్లు.. పచ్చని పొలాలు అంటే పెయింట్‌ చేసిన బ్యాక్‌డ్రాప్‌లు. కానీ ఆ నిర్వచనాన్నే మార్చిన దర్శకుడు భారతీరాజా. కెమెరాను నేరుగా గ్రామాల్లోకి తీసుకెళ్లి.. పల్లె మనుషుల ప్రేమ, బాధ, ఆవేదన, తిరుగుబాటును వెండితెరపై ఆవిష్కరించిన సినీ సృష్టికర్త ఆయన. మట్టి వాసనను, ప్రకృతి అందాలను, సాధారణ మనుషుల జీవితాలను సినిమాకు ప్రధాన పాత్రలుగా మార్చిన దర్శకుడిగా భారతీరాజా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తమిళ సినిమాను కొత్త దారిలో నడిపించిన ఆయన ప్రభావం తెలుగు సహా దక్షిణ భారత సినిమా మొత్తంపైనా కనిపించింది.

సినిమాల్లోకి రాకముందు భారతీరాజా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. అయితే కళలపై ఉన్న మక్కువ ఆయనను సినీ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఎన్నో కష్టాలు, నిరీక్షణల తర్వాత దర్శకుడిగా మారిన ఆయన, గ్రామీణ కథలను చూపించే విధానాన్నే మార్చేశారు. అప్పటి వరకు సెట్లలో నిర్మించిన కృత్రిమ గ్రామాలే ఎక్కువగా కనిపించేవి. కానీ భారతీరాజా మాత్రం కెమెరాను నిజమైన పల్లెల్లోకి తీసుకెళ్లారు. మట్టి వాసన, పల్లె మనుషుల భాష, వారి ఆనందాలు, బాధలు అన్నింటినీ సహజత్వంతో చూపించారు. అందుకే ఆయనను తమిళ సినీ ప్రపంచం ప్రేమగా "దర్శకుల హిమాలయం"గా అభివర్ణించింది.

భారతీరాజా చిత్రాల్లో ప్రేమకథలు ఉంటాయి.. కానీ అవి కేవలం ప్రేమ చుట్టూ తిరిగేవి కావు. కుల వివక్ష, సామాజిక అసమానతలు, మహిళల సమస్యలు, గ్రామీణ జీవన విధానం, కుటుంబ బంధాలు వంటి అంశాలను కూడా ఆయన బలంగా ప్రస్తావించారు. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నాడనే భావన కంటే, ఒక నిజ జీవితాన్ని చూస్తున్నాననే అనుభూతిని కలిగించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉండేది.

దర్శకుడిగా మాత్రమే కాదు.. నటుడిగానూ భారతీరాజా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడిన భారతీరాజా, తన కుమారుడు మనోజ్‌ భారతీరాజా మరణంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయినప్పటికీ సినిమాపై ప్రేమను మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. కెరీర్‌ చివరి దశలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తండ్రి, తాత, గ్రామ పెద్ద.. ఇలాంటి పాత్రల్లో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దర్శకుడిగా ఎంత సహజత్వాన్ని చూపించారో, నటుడిగానూ అంతే సహజమైన అభినయంతో మెప్పించారు.

భారతీరాజా మరో గొప్ప సేవ ఏమిటంటే.. కొత్త ప్రతిభను వెలికితీయడం. ఆయన చిత్రాల ద్వారా అనేక మంది నటులు, సాంకేతిక నిపుణులు సినీ రంగానికి పరిచయమయ్యారు. తర్వాత వారు భారతీయ సినీ పరిశ్రమలో అగ్రస్థానాలకు చేరుకున్నారు. ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఒక గురువుగా కూడా ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది.

కెరీర్‌
భారతీరాజా.. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించారు. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరి తన కెరీర్‌ ఆరంభించారు. పలువురు దర్శకుల దగ్గర పని చేసిన ఈయన 1977లో '16 వయిదినిలే' అనే తమిళ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కిళక్కేపోగుమ్‌ రైలు, సిగప్పురోజాక్కళ్‌, టిక్‌ టిక్‌ టిక్‌, ముదల్ మరియాదై, కరుత్తమ్మ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. తమిళ సినిమాల్లో గ్రామీణ జీవన విధానాన్ని సహజత్వంతో చూపించడం మూలంగా ఆయనను “దర్శక ఇమయం”గా అభిమానులు పిలుస్తారు.

తెలుగులోనూ..
తెలుగులో సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని చిత్రాలు తెరకెక్కించారు. సీతాకోక చిలుక మూవీకిగానూ నంది అవార్డు అందుకున్నారు. మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. తన సినిమాల ద్వారా రాధ, రాధికా శరత్‌కుమార్‌, రేవతి, కార్తీక్ సహా పలువురు నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. భారతీరాజా దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అనేక సినిమాలు చేశారు.

ఆరు జాతీయ అవార్డులు
ఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులతో పాటు పలు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతీరాజాను 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Advertisement
 
Advertisement
Advertisement