
హీరోలు హీరోయిన్లు సినిమా ప్రచారంలో పాల్గొంటారే తప్ప ప్రచార బాధ్యతల్ని స్వయంగా చేపట్టడం అనేది జరగదు. సాధారణంగా ఆ బాధ్యతను కూడా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలే చూసుకుంటాయి. అయితే గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీయార్ దీనికి కొంత విభిన్నంగా ప్రయాణిస్తున్నారు. సినిమా నిర్మాణ సంస్థల ప్రచారపు తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ... తాను కూడా వ్యక్తిగతంగా మరోవైపు నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. వ్యక్తిగతంగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అంతర్జాతీయ స్థాయి లో ప్రచార వ్యూహాలు అమలు చేశారట. ఆ సినిమా మల్టీ స్టారర్ అయినప్పటికీ జూ.ఎన్టీయార్(Jr NTR)కు వచ్చిన గుర్తింపు మరెవరికీ రాకపోవడానికి అదే కారణం అంటున్నారు. పలువురు హాలీవుడ్ దర్శకులు సైతం జూ.ఎన్టీయార్‌తో సినిమా చేయడానికి రెడీ అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే.
(చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మితో అల్లు అర్హ క్యూట్ వీడియో)
తాజాగా వార్ 2 సినిమా విషయంలోనూ ఆయన ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ టైగర్... వార్ 2 ని రూపొందించిన యష్ రాజ్ ఫిలింస్ ప్రచార శైలి పట్ల కినుక వహించారో, లేక తను కూడా మరింత బలం చేకూర్చాలనుకున్నారో తెలీదు గానీ ఈ సినిమా ప్రచారం విషయంలో ఎన్టీయార్ తన పిఆర్ టీమ్‌ను అలర్ట్ చేశారట. మరోవైపు తాజాగా సయ్యారా సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాను కూడా సమర్పించిన యశ్ రాజ్ ఫిలింస్ భవిష్యత్తు ప్రమోషన్ వ్యూహంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది.
(చదవండి: ఆ సీన్ చేయలేనని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా)
సయ్యారా సినిమా మార్కెటింగ్‌ను ఈ సంస్థ అత్యంత వినూత్నంగా నిర్వహించింది. ప్రధాన జంట ప్రమోషన్ కోసం చాట్ షోలు షాపింగ్ మాల్స్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటివి చేయడానికి బదులుగా, సినిమా పాటలు విజువల్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచడం అనే కొత్త వ్యూహాన్ని ఈ సినిమా కోసం అవలంబించి విజయం సాధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వార్ 2 ప్రచార సరళిలో కూడా ఈ సంస్థ కీలక మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం.
అయితే ఈ మార్పు చేర్పుల పట్ల అంతగా సంతృప్తి చెందని జూనియర్ ఎన్టీఆర్ తన చిత్రం ప్రమోషన్ బాధ్యతలను తానే స్వయంగా చేపట్టారట. యశ్ రాజ్ ఫిలింస్ వారి మార్కెటింగ్ వ్యూహాన్ని వారు అనుసరిస్తున్నారని భావించిన ఎన్టీఆర్, తన వ్యక్తిగత మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరో టాప్ హీరోతో కలిసి చేసే మల్టీ స్టారర్స్ విషయంలో జూ.ఎన్టీయర్ మరింత జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టార్స్ కనిపించకపోవచ్చుననే అంచనాలతో, అభిమానులు సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.