– అర్చనా అయ్యర్
‘‘శంబాల’ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ వైబ్ వస్తుంది. అన్ని రకాల భావోద్వేగాలను టచ్ చేస్తూ తీసిన ‘శంబాల’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరోయిన్ అర్చనా అయ్యర్ చెప్పారు. ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వం వహించిన చిత్రం ‘శంబాల’. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అర్చనా అయ్యర్ మాట్లాడుతూ– ‘‘నేను తెలుగమ్మాయినే. మాది చిత్తూరు జిల్లా. అయితే ఎడ్యుకేషన్ మొత్తం బెంగళూరులోనే జరిగింది.
‘శంబాల’లో నాది కేవలం స్టెప్పులు వేసే పాత్ర కాదని ముందే చెప్పారు. నా కెరీర్ ఆరంభంలోనే ‘శంబాల’ లాంటి చిత్రం, ఈ చిత్రంలో దేవిలాంటి పాత్ర చేయడం నా లక్‌గా భావిస్తున్నాను. ఇలాంటి పాత్రలు కెరీర్‌లో మళ్లీ మళ్లీ రావు. ఒక్కసారే వస్తాయి. ‘శంబాల’ ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది. చాలా మంది దర్శకులు ఫోన్ చేసి, నన్ను అభినందిస్తున్నారు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ మూవీ చేస్తున్నాను. పాత్ర డిమాండ్ చేస్తే రొమాంటిక్ సీన్లు చేస్తాను. అలాగే ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది’’ అని చెప్పారు.


