యుగంధర్, సాయికుమార్, ‘దిల్’ రాజు, ఆది
‘‘ఒకప్పుడు ‘బొమ్మరిల్లు’ సినిమా సినీ ఇండస్ట్రీలో చాలా మార్పు తీసుకొచ్చింది. నిజంగా ‘బొమ్మరిల్లు 2’ తీయాలంటే మాత్రం ఆది, వాళ్ల నాన్న సాయి కుమార్‌లతో తీయాలి. కొడుకు సక్సెస్ కోసం తండ్రి పడే తపనను మాటల్లో చెప్పలేం. అలా సాయి కుమార్‌గారు తన కొడుకుతో పాటు ‘శంబాల’ టీమ్ మొత్తానికి బ్యాక్‌బోన్‌లా నిలిచి, ఈ సినిమా విజయంలో భాగమయ్యారు. ‘శంబాల’ ప్రోమో చూసినప్పుడే ఈ చిత్రం సక్సెస్ అవుతుందని చెప్పాను. అది నిజమైంది’’ అని పేర్కొన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శంబాల’.
యుగంధర్ ముని దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న విడుదలైంది. తమ సినిమా మంచి విజయం సాధించిందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్‌లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శంబాల’ సినిమాకు పబ్లిక్‌లో మంచి టాక్ వచ్చి, సక్సెస్ కావడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి, క్రిస్మస్ విన్నర్‌గా నిలిచింది. ఆది కెరీర్‌లో ‘శంబాల’ 25వ చిత్రం. ఈ మూవీతో తనకి మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పుకోవాలి. అలాగే మొత్తం యూనిట్‌కి శుభాకాంక్షలు’’ అని అన్నారు.
‘‘మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందని ‘శంబాల’ చిత్రం నిరూపించింది. సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. జనవరి 9న ఈ సినిమా హిందీలో రిలీజ్ అవుతోంది. అక్కడ కూడా సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాను’’ అని చెప్పారు సాయి కుమార్. ‘‘ఇకపై కెరీర్‌ను బాగా ప్లాన్ చేసుకుని, ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాను’’ అని తెలిపారు ఆది సాయికుమార్. ‘‘ఆదిగారు లేకుండా ఈ సినిమా లేదు. కొన్ని థియేటర్స్‌లో మా ‘శంబాల’ సినిమా కంటిన్యూస్‌గా 11 రోజులు హౌస్‌ఫుల్‌తో ప్రదర్శితమైంది’’ అని అన్నారు యుగంధర్ ముని. ‘‘మా సినిమాను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని చెప్పారు మహిధర్ రెడ్డి, రాజశేఖర్. అనంతరం ‘శంబాల’ సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ మెమొంటోలను అందజేశారు ‘దిల్’ రాజు.


