ప్రమోషనల్ కంటెంట్‌తో కొంతలో కొంత ఆకట్టుకున్న హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, బబ్లూ పృథ్వీరాజ్ లీడ్ రోల్స్ చేశారు. సున్నిత మనస్కులు ఈ మూవీకి రావొద్దని నిర్మాతలు స్టేట్‌మెంట్ ఇవ్వడం లాంటివి ఆసక్తి కలిగించాయి. తాజాగా(డిసెంబరు 25) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? చెప్పినంతలా భయపెట్టిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ఈ కాలంలోనూ దెయ్యాలు, భూతాలు ఉన్నాయా? అంటే చాలామంది అలాంటివేం లేవని అంటారు. మరికొందరు మాత్రం అవును అలాంటివి ఉన్నాయని నమ్ముతుంటారు. అలా వ్యతిరేక భావాలున్న ఇద్దరూ ఎదురెదురు పడి సవాళ్లు విసురుకుంటే ఏమైందనేదే 'ఈషా' సినిమా.
హారర్ సినిమాలు అనగానే కొన్ని అంశాలు పక్కాగా ఉంటాయి. హీరో లేదా హీరోయిన్ పాత్రధారులు దెయ్యాల్ని నమ్మకపోవడం.. అనుకోని పరిస్థితుల్లో పాడుబడిన బంగ్లాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటం.. దెయ్యాల్ని వదిలించే ఓ శక్తివంతైన బాబా.. ఇలాంటివి దాదాపుగా కనిపిస్తాయి. అయితే ఎన్ని ఉన్నా సరే ప్రేక్షకుడు భయపడ్డాడా లేదా అనేది కీలకం. ఈ విషయంలో 'ఈషా'కు పాస్ మార్కులే పడతాయి. ఎందుకంటే నాలుగైదు చోట్ల భయపెట్టడం తప్పితే గొప్పగా ఏం లేదు.

నలుగురు ఫ్రెండ్స్ దెయ్యాలు లేవని నిరూపించడం.. ఈ క్రమంలోనే ఆదిదేవ్ బాబాని వెతుక్కుంటూ అతడి దగ్గరకు వెళ్లడం.. మార్గం మధ్యలో ఓ ప్రమాదం.. ఓ సవాలు.. అనుకోని పరిస్థితుల్లో వీళ్లంతా పాడుబడిన బంగ్లాలో ఉండాల్సి రావడం.. ఇలా దాదాపు స్టోరీ అంతా ఫ్లాట్‌గానే వెళ్తూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెడుతూ ఉంటుంది తప్పితే తెరపై సీన్స్ ఆ ఫీల్ కలిగించవు.
ఇందులో పుణ్యవతి ఎపిసోడ్ భయపెడుతుంది. కాకపోతే అదంతా చాలా సింపుల్‌గా తేల్చేయడం ఏంటో అర్థం కాదు. అసలు ఆ పాత్రని ఇంకాస్త పొడిగించి ఉంటే భయపెట్టే స్కోప్ చాలా ఉండేది. ఆమె ఆత్మకు.. కొడుకు, భర్తతోనూ ఎమోషనల్ సీన్స్ పెట్టొచ్చు. కానీ దర్శకుడు అలా ఎందుకు ఆలోచించలేకపోయాడా అనిపిస్తుంది. పుణ్యవతి పాత్రని ఎందుకో మధ్యలోనే వదిలేశారో ఏంటో? అలానే అమెరికాలో టాప్ న్యూరో సర్జర్ అయిన ఆదిదేవ్.. మన దేశానికి వచ్చి దెయ్యాల్ని వదిలిస్తూ బాబాగా ఎందుకు మారాడో అర్థం కాదు. అతడి బ్యాక్ స్టోరీ చెప్పలేదు.
ఈ సినిమాకు క్లైమాక్సే కీలకం. దర్శకుడు కూడా దాన్నే నమ్ముకుని తీశాడు. క్లైమాక్స్ ఒక్కటే సర్‌ప్రైజ్ చేస్తే సరిపోదుగా.. మిగతా సీన్స్ కూడా ఎంగేజ్ చేయాలి. అప్పుడే మూవీ బాగుంటుంది. ఇక్కడా ఆ పొరపాటే జరిగింది. క్లైమాక్స్ తప్పితే మిగతా అంతా రొటీన్. అకస్మాత్తుగా చనిపోయిన వాళ్లు ఆత్మలుగా ఎందుకు మారతారు? అనే పాయింట్‍ని చివరలో చూపిస్తూ.. సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చి ముగించారు.
ఎవరెలా చేశారు?
ఫ్రెండ్స్ గ్యాంగ్ త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ బాగానే చేశారు. బాబా ఆదిదేవ్‌గా బబ్లూ పృథ్వీరాజ్ ఓకే. వేషధారణ కాస్త విచిత్రంగా ఉన్నా ఎందుకో పవర్‌ఫుల్‌గా చూపించలేకపోయారు. పుణ్యవతి ఆత్మ ఆవహించిన వ్యక్తిగా మైమ్ మధు అదరగొట్టేశాడు. గెటప్ చూస్తేనే భయపడతాం. ఆ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. ధ్రువన్ సంగీతం బాగుంది. సీన్‌లో దమ్ములేకపోయినా సౌండ్‌తో భయపెట్టే ప్రయత్నం బాగా చేశారు. విజువల్స్ కూడా హారర్ ఫీల్ కలిగించాయి. దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఎంచుకున్న పాయింట్‌లో కొత్తదనం లేదు. సినిమాని కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా తీయలేకపోయాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లున్నాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'ఈషా' ఓకే.
- చందు డొంకాన


