గత రెండు మూడు రోజుల నుంచి వార్తల్లో నిలిచిన నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దండోరా'. కుల వివక్ష, పరువు హత్య లాంటి సబ్జెక్ట్ ఈ మూవీ కాన్సెప్ట్. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు(డిసెంబరు 25) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
అది 2004. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ దగ్గర తుళ్లూరు అనే గ్రామం. ఇక్కడ అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి దహనం చేస్తుంటారు. ఇదే గ్రామంలో శివాజీ (శివాజీ) ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి. కొన్ని కారణాల వల్ల ఇతడు చనిపోతాడు. కుల పెద్దలు మాత్రం ఇతడి శవాన్ని ఊరి శ్మశానంలో తగలబెట్టడానికి వీల్లేదని తీర్మానిస్తారు. అసలు శివాజీని వాళ్ల కులమే ఎందుకు బషిష్కరించింది? ఇతడి గతమేంటి? శివాజీతో కన్న కొడుకు విష్ణు(నందు) ఎందుకు ఏళ్లుగా మాట్లాడటం మానేశాడు? ఇతడితో వేశ్య శ్రీలత (బిందుమాధవి)కి సంబంధమేంటి అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
టాలీవుడ్‌లో కుల వివక్షపై వచ్చిన సినిమాలు తక్కువే. వివాదాలు ఏర్పడతాయని భయమో? కమర్షియల్‌గా ఆడవనే ఉద్దేశమో గానీ ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడే వస్తుంటాయి. 'దండోరా' కూడా అలాంటి ఓ సినిమానే. మరి ఇది ఎలా ఉంది అంటే ఓకే ఓకే. ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని డీల్ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. లాజిక్స్ మర్చిపోయాడు!
అణచివేయబడిన కులానికి చెందిన ఓ వృద్ధురాలి శవాన్ని ఊరి చివరకు తీసుకెళ్లే సీన్‌తో సినిమా మొదలవుతుంది. 2004 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కథంతా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా కులం గొడవలు, రవి-సుజాతల లవ్ స్టోరీతో టైమ్ పాస్ అయిపోతుంది. కులాన్ని ఎక్కువగా చూసే ఓ గ్రామంలో ఓ మనిషి చచ్చిపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా సాదాసీదాగానే ఉంటుంది తప్పితే ఇందులో కొత్తగా ఏముందా అనిపిస్తుంది. కులం గొడవలు అంటే కచ్చితంగా హత్య, చావు ఉంటాయిగా.. అలా ఓ హత్యతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.
ఫస్టాప్ ఓకే ఓకే అనిపించినప్పటికీ సెకండాఫ్ కాస్త ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కులం కాన్సెప్ట్‌పై తీసిన సినిమాల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి మనోవేదన అనుభవిస్తారనే విషయాన్ని చూపించారు. ఇందులో మాత్రం హత్యకు కారణమైన వ్యక్తి, అతడి కుటుంబం ఎలాంటి మానసిక వేదన అనుభవిస్తుంది అనే అంశాన్ని చూపించారు. క్లైమాక్స్‌ని కూడా ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ముగించారు.
సినిమా అంతా చూసిన తర్వాత ఇలాంటివి వార్తల్లో చాలా చూశాం. క్లైమాక్స్ తప్పితే ఇందులో కొత్తగా ఏముందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే మూవీలో ఓ కులం వాళ్లు.. ఊరిలో స్మశానం మెంటైన్ చేస్తుంటారు. వేరే కులం వాళ్లు ఎక్కడో ఊరి అవతల శవాల్ని దహనం చేస్తుంటారు. అయితే అణచివేయబడిన కులానికి చెందిన వ్యక్తులు.. ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్యని ఎందుకు పరిష్కరించుకోలేకపోయారు? అసలు వీళ్లలో కనీసం ఒక్కరికి కూడా ఆలోచన రాదా? ఎవరో దానం చేస్తే తప్ప వీళ్లకు వేరే గత్యంతరం లేదా? ఇలా చాలా సందేహలు వస్తాయి. దర్శకుడు ఈ లాజిక్స్ అన్ని ఎలా మిస్ అయ్యాడా అనిపిస్తుంది.
సర్పంచ్ క్యారెక్టర్ అయితే మరీ విచిత్రంగా ఉంటుంది. చిన్నప్పుడు ఓ సంఘటన చూసి ఊరికి ఏదో చేసేద్దామని డిసైడ్ అయిన వ్యక్తి.. అధికారం వచ్చినా సరే ఏం చేయకపోవడం, వేరే వాళ్లు దానం చేస్తే దాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకోవడం కన్విన్సింగ్‌గా అనిపించదు. స్టోరీకి అవసరం లేని సీన్స్ కూడా చాలానే ఉంటాయి. చాలా సీరియస్ కాన్సెప్ట్ చెబుతున్నప్పుడు సీన్స్ ఎంత ఎంగేజింగ్‌గా ఉంటే అంత బెటర్. కానీ ఇందులో కొన్ని మెరుపులు మాత్రమే ఉంటాయి. కొన్ని డైలాగ్స్ ఆలోచింపజేస్తాయంతే.

ఎవరెలా చేశారు?
శివాజీ బాగానే చేశాడు. కానీ ఆ పాత్ర 'కోర్ట్'లో మంగపతి క్యారెక్టర్‌కి కొనసాగింపులా ఉంటుంది తప్పితే కొత్తగా ఏముందా అనిపిస్తుంది. రవికృష్ణది రొటీన్ పాత్రే అయినప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. నవదీప్ 2.0 అని ఈ మూవీ టైటిల్స్‌లో వేశారు కానీ ఇందులో అతడి పాత్రకు పెద్దగా స్కోప్ దొరకలేదు. చాలా సాధారణంగా ఉంటుంది. వేశ్యగా బిందుమాధవి పాత్ర బాగుంది కానీ ఆమె డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఎందుకో సెట్ కాలేదనిపిస్తుంది. శివాజీ కొడుకు విష్ణుగా చేసిన శ్రీ నందుకు మంచి స్కోప్ దొరికింది. డిఫరెంట్ వేరియేషన్స్ బాగా చూపించాడు. శివాజీ కూతురు సుజాతగా చేసిన మనిక చూడటానికి బాగుంది. మిగతా పాత్రధారులు కూడా తమ ఫరిది మేరకు అలరించారు.
టెక్నికల్ విషయాలకొస్తే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. 'దం.. దండోరా' అని సాగే పాట బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్. దర్శకుడు మురళీకాంత్ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని చూపించిన విధానం ఓకే ఓకే అనిపిస్తుంది. కాకపోతే డైరెక్టర్‌లో విషయముందనిపిస్తుంది. నిర్మాణ విలువలు స్టోరీకి తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే కుల వివక్షకు కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి తీసిన సినిమా 'దండోరా'. స్టోరీ కంటే పాత్రలు, కొన్ని డైలాగ్స్ గుర్తుంటాయి.
- చందు డొంకాన


