'మూవీ రిలీజ్ తర్వాత ట్రైలర్..' జూనియర్ ఎన్టీఆర్‌ ఫిదా | Jr NTR praises 94 year old Singeetham Srinivasa Rao new film attempt | Sakshi
Sakshi News home page

Jr NTR: 'మూవీ రిలీజ్ తర్వాత ట్రైలర్..' జూనియర్ ఎన్టీఆర్‌ ఫిదా

Jun 16 2026 9:00 AM | Updated on Jun 16 2026 10:56 AM

Jr NTR praises 94 year old Singeetham Srinivasa Rao new film attempt

దాదాపు 94 ఏళ్ల వయసులో డైరెక్షన్‌ అంటే ఎవరికైనా అసాధ్యమే. అదేం కాదంటూ సింగీతం శ్రీనివాసరావు నిరూపించాడు. వయసులో సెంచరీ కొట్టినా కూడా దర్శకత్వం చేయొచ్చనే సంకేతాలిచ్చాడు. ఇదంతా చూస్తుంటే సినిమా అంటే ఆయనకు ఎంత పిచ్చో అన్నది మనకు అర్థమైపోతోంది. తాజాగా సింగ్ గీతం అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరికొత్త ప్రయోగంతో తన దర్శకత్వ టాలెంట్‌ను ఈ వయసులోనూ చూపించారు.

దీంతో ఈ మూవీపై టాలీవుడ్ అగ్రతారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, కమల్ హాసన్‌ ఈ సినిమాను అభినందించారు. తాజాగా ఈ లిస్ట్‌ మన యంగ్ టైగర్ కూడా చేరిపోయారు. సింగ్ గీతం ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్.. సింగీతం శ్రీనివాసరావును కొనియాడారు. ఈ మూవీ తన హృదయానికి హత్తుకుందన్నారు. 94 ఏళ్ల వయసులోనూ ఆయన సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

ఎన్టీఆర్ తన ట్వీట్‌లో రాస్తూ.. "నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన చిత్రం సింగ్ గీతం. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన శైలి, సృజనాత్మకత, వివేకాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకం. దేవి శ్రీ ప్రసాద్ సినిమా అంతటా అదరగొట్టారు. ప్రతి సన్నివేశానికీ మ్యాజిక్ తీసుకొచ్చారు. నాగ్ అశ్విన్ ఆయన 40 ఏళ్ల కలను నెరవేర్చడం దైవ వరమే. వైజయంతి ఫిల్మ్స్ కలిసి సింగీతం గారికి మీరిచ్చిన అద్భుతమే ఈ చిత్రం. చిత్ర బృందానికి నా అభినందనలు. సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరిచినట్లే.. మూవీ విడుదలైన తర్వాత ట్రైలర్ విడుదల చేయడం అతిపెద్ద ఆశ్చర్యం. ఈ ట్రైలర్‌ మీ అందరికీ అందించడం నాకు దక్కిన గౌరవం. థియేటర్లలోకి వెళ్లి సినిమాను ఆస్వాదించండి." అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. నాగ్ అశ్విన్ నిర్మించిన 'సింగ్ గీతం' జూన్ 12న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ అందుకుంటోంది. ఇందులో శాలిని కొండేపూడి, అహల్య, అయాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ బంగారు గనులు ఉన్న కుబేరపురం అనే గ్రామంలో జరుగుతుంది. సంపద కోసం గనులను అమ్మి, చెట్లను నరికివేయాలన్న గ్రామస్తుల ప్రణాళికను వ్యతిరేకించే ఒక యువతి కథే సింగ్ గీతం. ఈ పోరాటంలో ఆమెకు ఒక యువకుడు మద్దతుగా నిలుస్తాడు. కానీ గ్రామ దేవత శాపం కారణంగా గ్రామస్తులు సాధారణ సంభాషణలకు బదులుగా.. కేవలం పాటల ద్వారా మాత్రమే మాట్లాడుకోవడంతో వారి పోరాటం ఊహించని మలుపు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ మూవీ కథ.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement