‘‘తెలుగులో నేను అంగీకరించిన తొలి సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend Movie). కాకపోతే ‘ఖుషి’ తో నా ఎంట్రీ జరిగింది. ‘ఖుషి, హాయ్ నాన్న, మనమే, 8 వసంతాలు’... ఇలా నా మ్యూజిక్ డైరెక్షన్‌లో వచ్చిన ప్రేమకథా చిత్రాలతో పోల్చినప్పుడు ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి కాస్త విభిన్నమైన సంగీతం అందించాను. ఎందుకంటే... ఇది ఇంటెన్స్ లవ్‌స్టోరీ’’ అని చెప్పారు సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab). రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’.
నా భార్యతో సినిమా చూశా..
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ.. ‘‘మహిళలు, నేటి తరం యువత, తల్లిదండ్రులు ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను కచ్చితంగా చూడాలన్నది నా అభిప్రాయం. నా భార్యతో కలిసి నేను ఈ సినిమా చూశాను. మేం భావోద్వేగానికి లోనయ్యాం. నేటి సమాజంలోని ఓ అంశాన్ని ప్రస్తావించారు రాహుల్ రవీంద్రన్. రష్మిక, దీక్షిత్ అద్భుతంగా నటించారు. సంగీతానికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడలేదు.
ఆ సినిమాకు ఏఐ వాడా..
కానీ సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో కొంత ఏఐ వాడాం. ‘హాయ్ నాన్న’ సినిమాకు సంగీతంలో ఏఐ వాడాను. ఏఐ మన జీవితాల్లో భాగమైపోయింది. హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కొత్త సినిమాకు సంగీతం అందిస్తున్నాను. తమిళంలో ఓ సినిమాకు, కన్నడంలో గణేశ్‌గారి సినిమాకు సంగీతం అందిస్తున్నాను. కన్నడలో నా తొలి మూవీ ఇది. హిందీలో నా తొలి సినిమా ఖరారైంది. త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుంది’’ అని చెప్పారు.


