
స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ సందర్భంగా రజినీకాంత్ 'కూలీ', ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే రెండు కూడా పూర్తిస్థాయిలో హిట్ అనిపించుకోలేకపోయాయి. కొందరికి ఈ మూవీస్ నచ్చితే.. మరికొందరు మాత్రం ఓకే ఓకే ఉన్నాయని అంటున్నారు. ఏదైతేనేం లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ప్రేక్షకులు.. థియేటర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా బాగానే కనిపిస్తుంది. ఇంతకీ రెండు రోజుల్లో ఈ చిత్రాలకు ఎంతెంత వచ్చాయి? ఎవరు ముందున్నారు?
'కూలీ' గురించి ముందుగా మాట్లాడుకుంటే.. తొలిరోజు రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. తమిళంలో తొలిరోజు అత్యధిక కలెక్షన్ వచ్చిన సినిమాగా రికార్డ్ కూడా సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. అయితే మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజు నంబర్లు కాస్త డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా రూ.86 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ సమాచారం. అంటే రెండు రోజుల్లో కలిపి దగ్గరదగ్గర రూ.240 కోట్ల వసూళ్లు వచ్చినట్లు టాక్.
(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్‌లీ కారు కొన్న నటుడు సౌబిన్ షాహిర్)
'కూలీ' రెండో రోజ వసూళ్లలో తమిళం నుంచి రూ.34 కోట్లు రాగా, తెలుగు-హిందీల నుంచి వరసగా రూ.13.5 కోట్లు, రూ.7.5 కోట్లు వచ్చినట్లు సమాచారం. లాంగ్ రన్‌లోనూ తమిళంతో పాటు తెలుగు నుంచి ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయని దీనిబట్టి అంచనా వేయొచ్చు. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్.. ఇలా స్టార్స్ ఉండటం ఈ మూవీకి ఓ రకంగా బాక్సాఫీస్ దగ్గర ప్లస్ అవుతోంది.
మరోవైపు 'వార్ 2' విషయానికొస్తే.. నిర్మాతలు అధికారికంగా వసూళ్ల లెక్కలు ప్రకటించలేదు. కానీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండు రోజుల్లో కలిసి రూ.115 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రెండోరోజు రూ.56.5 కోట్ల నెట్ వచ్చినట్లు వినిపిస్తోంది. మొదటిరోజుతో పోలిస్తే రెండోరోజే కాస్త పెరుగుదల కనిపించింది. ఓవరాల్‌గా హిందీలో రూ.75 కోట్ల నెట్ రాగా, తెలుగు నుంచి రూ.40 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే 'కూలీ'నే ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. మరి వీకెండ్ అయ్యేసరికి అధికారిక నంబర్లు ప్రకటిస్తారేమో చూడాలి?
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)