తండ్రిగా గర్వపడుతున్నాను: చిరంజీవి | Chiranjeevi attends Peddi mega blockbuster event as chief guest | Sakshi
Sakshi News home page

తండ్రిగా గర్వపడుతున్నాను: చిరంజీవి

Jun 24 2026 1:03 AM | Updated on Jun 24 2026 1:03 AM

Chiranjeevi attends Peddi mega blockbuster event as chief guest

రామ్‌చరణ్, బుచ్చిబాబు, చిరంజీవి, సతీష్‌ కిలారు

‘‘మగధీర, రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సినిమాల తర్వాత రామ్‌చరణ్‌కి ఇంత త్వరగా ‘పెద్ది’ సినిమా, పెద్దిపాత్ర చేసే చాన్స్‌ రావడం అదృష్టం. నటుడికి ఎన్ని రకాల కోణాలు ఉండాలో అన్నింటిలోనూ పరిపక్వత సాధించి, వంద శాతం తెరపై చూపించినటువంటి రామ్‌చరణ్‌ని అభినందిస్తున్నాను. తండ్రిగా గర్వపడుతున్నాను’’ అని హీరో చిరంజీవి పేర్కొన్నారు. రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌ జోడీగా నటించిన చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న రిలీజ్‌ అయింది.

మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘పెద్ది’ మెగా బ్లాక్‌బస్టర్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పెద్ది’ చూసి భావోద్వేగానికి గురయ్యాను. అరుదైన సినిమాలు అలాంటి అనుభూతినిస్తాయి. ఈ మూవీ చూస్తున్నంత సేపు ఆయాపాత్రలతో నేనూ ప్రయాణం చేశాను. ఇలాంటి బలమైన కథని ఎన్నుకుని చరణ్‌ అయితే న్యాయం చేస్తాడని తనతో సినిమా తీసిన బుచ్చిబాబుకి అభినందనలు. మట్టి మనుషుల కథ ఇది. ఈ కథకి బుచ్చిబాబు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. డైరెక్టర్‌ విజన్ ని, అత్యద్భుతమైన కథని నమ్మి బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా నిర్మించిన సతీష్‌ కిలారుని అభినందిస్తున్నాను.

నేను, సురేఖ కలిసి ‘పెద్ది’ చూస్తున్నప్పుడు తెరపై రామ్‌చరణ్‌ కనిపించలేదు.. పెద్ది మాత్రమే కనిపించాడు. చరణ్‌ వన్  మేన్  షో ఇది. తన నటనకు జాతీయ అవార్డు వస్తుందని అందరూ అంటున్నారు. అవార్డు రానివ్వండి... రాక పోనివ్వండి... అది సమస్య కాదు. ‘రంగస్థలం’ మూవీలోనూ తన నటనకి  జాతీయ అవార్డు వస్తుందన్నారు. రాకున్నా ఫర్వాలేదు. కానీ, అవార్డ్‌ విన్నింగ్‌ నటన అంటూ ప్రజలు అంటుంటే వారి అభిమానానికి మించిన పెద్ద అవార్డు ఏముంటుంది? అని నమ్ముతున్నాను. ‘పెద్ది’లో చరణ్‌ నటించలేదు.. జీవించాడు. అందుకనే తను చిరంజీవి కాదు... చరణ్‌జీవి అని మీ నుంచి వచ్చిన మాట. ‘పెద్ది’ సినిమా తర్వాత పుత్రోత్సాహం అన్నది నేను నూటికి నూరు శాతం ఫీలవుతున్నాను’’ అని తెలిపారు. 

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ– ‘‘కొన్ని విజయాల గురించి ఆలోచిస్తే తృప్తిగా ఉంటుంది. ‘పెద్ది’ చిత్రాన్ని ఎంత సక్సెస్‌ చేశారంటే రామ్‌చరణ్‌ని మరచి పోయి పెద్దిని గుర్తు పెట్టుకుంటారేమో అనిపిస్తోంది. నా కుమార్తె క్లీంకార కూడా నాన్న అని కాకుండా పెద్ది అని పిలుస్తోంది’’ అని చె΄్పారు.  వెంకట సతీష్‌ కిలారు మాట్లాడుతూ–‘‘పెద్ది’కి మొదటి రోజు కొంచెం నెగెటివిటీ వచ్చినా తెలుగు ప్రేక్షకులు తమ భుజాలపై ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. మా మూవీ రిలీజై 19 రోజులు అయినా కానీ థియేటర్లన్నీ ఇప్పటికీ కళకళలాడుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ అందరూ సంతోషంగా ఉన్నారు’’ అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement