టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. అప్పుడప్పుడు ఏదో ఓ కార్యక్రమంలో కనిపించడం తప్పితే పెద్దగా వివాదాల్లోనూ ఉండరు. అలాంటిది బ్రహ్మీ.. తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫొటో తీసుకుందామని అంటే ఇవ్వలేదని ఓ ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా బ్రహ్మానందం ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చారు.
'ఉదయాన్ని ఓ వీడియో చూసి నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్‌బాబు ఫంక్షన్‌కి వెళ్లాను. బాగా రాత్రయిందని వెళ్లిపోయే హడావుడిలో ఉన్నాను. అంతలో దయా అన్న ఎదురయ్యాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. 'రాన్న రాన్న ఫొటో తీసుకుందాం' అని దయా అన్న అడిగాడు. ఫొటో వద్దు ఏమీ వద్దు అని నేను అక్కడినుంచి వచ్చేశా. చాలామంది మిత్రులు దీన్ని అపార్థం చేసుకున్నట్లున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. మంచి మిత్రులం. నన్ను ఎంతో అభిమానంగా, ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం'
(ఇదీ చదవండి: 'స్పిరిట్'లో రవితేజ, త్రివిక్రమ్ కొడుకులు.. ఫొటో వైరల్)
'మేం మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆయనతో ఉన్న చనువుతో అలా సరదాగా తోసేశాను. దాన్ని నేను ఏదో కావాలని చేసినట్లు కొంతమంది మీడియా మిత్రులు అపార్థం చేసుకున్నారు. అలాంటిదేం లేదు. తర్వాత కూడా ఆయన, నేను ఫంక్షన్‌లో చాలాసేపు మాట్లాడుకున్నాం. అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం. దీనిపై క్లారిటీ ఇవ్వడానికే వీడియో చేస్తున్నాను' అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.
ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోహన్ బాబు ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. ఈ ఈవెంట్‌లోనే బ్రహ్మానందం-దయాకర్ రావు మధ్య ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు స్వయంగా బ్రహ్మీనే క్లారిటీ ఇచ్చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. హీరోగా బాలనటుడు)
మాజీ మంత్రి ఎర్రబెల్లితో ఫోటో పంచాయితీ పై.. బ్రహ్మానందం క్లారిటీ!#Brahmanandam #Errabellidayakar #viralvideo pic.twitter.com/0R7jYRPj9G
— ramesh naini (@rameshnaini2) November 23, 2025


