టిను ఆనంద్, అక్షయ్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, విష్ణు ఓ.ఐ ప్రధాన పాత్రల్లో నటించిన న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్‌షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో గుణి మంచికంటి దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియో పతాకంపై వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 9న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఆజా మేరీ జానీ పాట లిరికల్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసి, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ బాగుందని, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
ఎలక్ట్రానిక్ కిలి – ఆనంద్ ద్వయం సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ రాయగా, బెన్నీ దయాల్ పాడారు. వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఆజా మేరీ..’ ఒక పార్టీ సాంగ్. అక్షయ్ – విష్ణు ఓయ్ ఈ పాటలో కనిపిస్తారు. పూర్తిగా మేఘాలయా రాష్ట్రంలో చిత్రీకరణను జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా మాదే. అనుకోకుండా జరిగే ఓ ఘటన కొన్ని సందర్భాల్లో మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటానికి కారణమవుతాయి. ఇలాంటి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని తెలిపారు.


