‘పాంచాలి పంచభర్తృక’ మూవీ రివ్యూ | Panchali Pancha Badruka Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

‘పాంచాలి పంచభర్తృక’ మూవీ రివ్యూ

Aug 14 2026 8:33 PM | Updated on Aug 14 2026 8:35 PM

Panchali Pancha Badruka Movie Review In Telugu

టైటిల్‌: పాంచాలి పంచభర్తృక
నటీనటులు: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృధ్వీ, సరీహ్ ఫార్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు
దర్శకుడు: గంగా సప్తశిఖర
సంగీతం: మహేష్ నారాయణ, బ్షేక్
నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి (అమెరికా), రాజ్ పవన్
ఎడిటర్: జానీ బాషా నాగ

‘పాంచాలి పంచభర్తృక’ టైటిల్ చాలా క్రేజీగా ఉండటం.. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్ వంటి భారీ తారాగణం నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ల హవా నడుస్తోంది. దీనికి కామెడీని కూడా జోడించడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. మరి నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..
డాక్టర్ దమయంతిని డాన్‌సన్ మనుషులు ఎత్తుకెళతారు. ఆమెను చంపేస్తామని బెదిరించి తమ బిజినెస్‌లో సహకరించేలా ఒప్పిస్తారు. మరోవైపు సీరియల్స్ తీసుకునే చిత్తరంజన్ (జెమిని సురేష్‌)కు సినిమా తీయాలని కోరిక. దాని కోసం యత్నిస్తూ ఉంటాడు. అద్దె ఇంటి కోసం కాట్‌రాజ్, పుష్పరాజ్ ఇద్దరూ వెదుకుతూ ఉంటారు. వారికి చిత్తరంజన్ తమ అపార్ట్‌మెంటులోని పెంట్ హౌస్‌లో తమతో పాటు ఉండాలని చెబుతాడు. అలా అద్దె షేర్ చేసుకుంటూ ఉంటారు. అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీ ముగ్గురు ఉండటానికి అంగీకరించకపోతే అతడిని పొగిడి బుట్టలో వేసుకుంటారు. అలా నలుగురూ ఏకమవుతారు. ఒకరోజు ఒక అమ్మాయిని తెచ్చుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అలా సెనోరిటాని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటారు. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ గురించి వాళ్లకు చెబుతుంది. ఆ తరువాత నలుగురూ ఓ పని మీద బయటకు వెళతారు. వెళ్లి వచ్చేసరికి సెనోరిటా రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఆ శవాన్ని మాయం చేద్దామని సూట్‌కేసులో పెడితే చివరకు ఆ సూట్‌కేసు కూడా మాయమవుతుంది. అసలు శవంతో ఉన్న సూట్‌కేసు ఏమైంది? పరమసుందరి (రాజేంద్ర ప్రసాద్) ఎవరు? సినిమాలో రోజ్‌మేరి పాత్ర ఏమిటి? సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు అలియాస్ ఎకో ఏం చేశాడు? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..
సినిమాలో పాత్రల పరిచయానికి కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆసక్తికరం. పాత్రల పరిచయమే చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఇక పాత్రల పేర్లు సైతం మరింత ఆసక్తికరం. సినిమా విషయానికి వస్తే కథ, కథనం అన్నీ చాలా బాగున్నాయి. నలుగురు వ్యక్తులు కలిసి అమ్మాయిని తెచ్చుకోవడం.. ఆమెతో గడపాలని అనుకుంటుండగానే ఆమె మరణించడం.. ఆ తరువాత అసలు ఆమెను ఎవరు చంపేశారు? అనేది లాస్ట్ వరకూ గెస్ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. స్క్రీన్‌ప్లే అంత గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌ అంతా పాత్రల పరిచయం, కామెడీ సన్నివేశాలు, మర్డర్‌తో నడిపిన దర్శకుడు.. సెకండాఫ్‌లో అసలు ఎవరు మర్డర్ చేశారు? అనేదే కాకుండా వరుసగా ఎక్కడా గందరగోళం లేకుండా చిక్కుముడులను విప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక చివరిలో రెండు ట్విస్ట్‌లు ఉంటాయి. అవి ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. ఒక సస్పెన్స్, థ్రిల్లర్‌ను కామెడీతో జత చేసి నడిపిన తీరు ఆకట్టుకుంది. సినిమాలో అనవసరమనే పాత్ర ఏదీ లేదు. ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, పృధ్వీరాజ్ వంటి ప్రముఖ నటులు తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు.

ఎవరెలా నటించారంటే..
ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృధ్వీలు తమ పాత్రలకు న్యాయం చేశారు.  జెమినీ సురేష్‌కు మంచి ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఆయన కూడా దానిని చక్కగా వినియోగించుకున్నారు. రోల్ రైడాకు ఇంతకాలానికి సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర దక్కింది. ముఖ్యంగా చాలా మంది కొత్తవారికి ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. సరీహ్ ఫార్, రోల్ రైడా, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ రాజ్ పవన్ సైతం ఓ కీలక పాత్రలో నటించారు. కొత్తగా నటిస్తున్నప్పటికీ ఎక్కడా తడబడకుండా బాగా నటించారు.

టెక్నికల్ పరంగా..
దర్శకుడు గంగా సప్తశిఖర ఈ కథను ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా తెరపై చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ప్రతి పాత్రకూ ప్రాధాన్యమిస్తూ.. ప్రతి పాత్రను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమాను ప్రెజెంట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎంతో అనుభవమున్న దర్శకుడి మాదిరిగానే అనిపిస్తారు. పైగా ఆయన స్వయంగా ఈ చిత్రంలో ఓ పాత్రలో నటించి మెప్పించారు. సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలుగా నటించి నవ్వులు పూయించారు.  మ్యూజిక్ విషయానికి వస్తే టైటిల్ సాంగ్ బాగుంది. మిగిలిన పాటలన్నీ ఓకే ఓకే.  పవన్ నిర్మాతగానే కాకుండా ఎడిటింగ్, మ్యూజిక్ విషయంలోనూ దృష్టి సారించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు  బాగున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement