ప్రముఖ తెలుగు నటి హేమ (Actress Hema) ఇంట ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది. సోషల్ మీడియాలో వచ్చిన నెగెటివిటీయే తన తల్లి మరణానికి కారణం అంటోంది హేమ. ఆమె మాట్లాడుతూ.. ఈ మధ్యే అమ్మ చనిపోయారు. ఆ దుఃఖాన్ని గుండెలో దాచుకుని మీతో ఒక గుడ్‌న్యూస్ షేర్ చేసుకోవాలనుకున్నాను. బెంగళూరు హైకోర్టు నాపై ఉన్న డ్రగ్స్ కేసును కొట్టివేశారు. ఆ సంతోషకర విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను.
కుంగిపోయిన అమ్మ
నవంబర్ 3న తీర్పు వెలువడింది. కానీ, ఆ జడ్జిమెంట్ కాపీ చేతికొచ్చేవరకు దాన్ని చెప్పకూడదన్నారు. అందుకే దాన్ని మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఈలోపల అమ్మకు స్ట్రోక్ వచ్చి చనిపోయింది. అమ్మ నా ధైర్యం, బలం. ఈరోజు నేనిలా ఉండటానికి కారణం మా అమ్మ. ఇది చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను. నేను ఓ సమస్యలో ఇరుక్కునేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియాలో నాపై జరిగిన దుష్ప్రచారం వల్ల అమ్మ చాలా కుంగిపోయారు.
నేను నిర్దోషిని
అమ్మకు ఒంట్లో బాగోలేదని అప్పుడు కూడా చెప్పాను. సెలబ్రిటీ అయినంతమాత్రాన మాపై ట్రోల్స్ చేసేందుకు మీకు ఏం అధికారం ఉంది? ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దని మొత్తుకున్నాను. అయినా వినిపించుకోలేదు. నేను నిర్దోషిని, నేనే తప్పూ చేయలేదన్నాను. సింహం రెండు అడుగులు వెనకేస్తుందంటే పారిపోతున్నట్లు కాదన్నాను. మళ్లీ వస్తానన్నాను.. వచ్చాను, నిలబడ్డాను. భగవంతుడు నావైపున్నాడు.
మా అమ్మను తీసుకొచ్చి ఇస్తారా?
నేను కేసు గెలిచాను. కానీ, మా అమ్మగారు చనిపోయారు. వీళ్లందరూ మా అమ్మను తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఒకవేళ నేను చచ్చిపోయాక తీర్పు వచ్చుంటే వీళ్లు నన్ను బతికిస్తారా? మనఃసాక్షి ఉండాలి. ఎన్నిసార్లు పోరాడాలి? ఆ దేవుడి దయ, అమ్మ దయ వల్ల నేను బతికి బట్టకట్టాను. లేకపోతే నా పరిస్థితేంటి? ఏడాదిన్నరగా నాలో నేనే మథనపడుతున్నాను అని హేమ కన్నీళ్లు పెట్టుకుంది.


