క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోనున్న 'సూర్య' | Actor Suriya Exit From Vetrimaran Movie | Sakshi
Sakshi News home page

క్రేజీ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోనున్న 'సూర్య'

Jun 6 2025 9:16 PM | Updated on Jun 6 2025 9:16 PM

Actor Suriya Exit From Vetrimaran Movie

కోలీవుడ్‌ దర్శకుడు వెట్రిమారన్‌, సూర్య కథానాయకుడిగా వాడివాసల్‌ చిత్రం చేయడానికి చాలా కాలం నుంచి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి సూర్య తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లోనే సూర్య బిజీగా ఉన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అయితే, వెట్రిమారన్‌ తన తర్వాతి సినిమాను హీరో శింబుతో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారట.

కోలీవుడ్‌ హీరో శింబు  గత రెండేళ్లకు పైగా ఎలాంటి చిత్రంలో నటించలేదు.  తాజాగా కమలహాసన్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో థగ్‌లైఫ్‌ చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు వరుసగా చిత్రాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దేశింగు పెరియస్వామి దర్శకత్వంలో ఒక చిత్రం, పార్కింగ్‌ చిత్రం రాంకుమార్‌ దర్శకత్వంలో మరో చిత్రం, అశ్వద్‌ మారి ముత్తు దర్శకత్వంలో ఇంకో చిత్రం, అంతేకాకుండా ఒక ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత నిర్మించే చిత్రంలోనూ నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. 

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో చిత్రాన్ని శింబు కమిట్‌ అయినట్లు తెలిసింది. వెట్రిమారన్‌ దర్శకత్వంలో శింబు నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీన్ని వి.క్రియేషన్‌న్స్‌ సంస్థ నిర్మించనుందని టాక్‌.. ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement