రవితేజ.. టాలీవుడ్‌లో ఈ పేరుకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌లోకి ఇండస్ట్రీలోకి వచ్చి.. చిన్నచితకా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ ఆపై నటుడిగా, తర్వాత కాలంలో స్టార్ హీరో అయిన ఇతడు.. ఎందరో వర్ధమాన నటీనటులకు ఆదర్శం. కానీ ప్రస్తుతానికొస్తే రవితేజ సినిమాలపై బోలెడన్ని విమర్శలు. తాజాగా 'మాస్ జాతర'తో మరో ఫెయిల్యూర్. ఇదంతా చూస్తుంటే అసలు రవితేజ ఎందుకిలా చేస్తున్నాడు? ఎక్కడ తప్పు జరుగుతోంది? అనేది సగటు ప్రేక్షకుడి సందేహం.
(ఇదీ చదవండి: 'బాహుబలి' లేకపోతే ఆ సినిమాలు తీసేవాడిని కాదు: మణిరత్నం)
గత కొన్నేళ్లుగా రవితేజ సరైన సినిమాలు చేయట్లేదు. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు లాంటి ఒకటి రెండు ప్రయోగాలు చేసినప్పటికీ వాటిలో యూనిక్ పాయింట్‌ని కమర్షియల్ అంశాలు డామినేట్ చేశాయి. దీంతో ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్‌గానే మిగిలిపోయాయి.
2017లో వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమా హిట్. దీని తర్వాత 'టచ్ చేసి చూడు', నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, క్రాక్, ఖిలాడీ, రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర.. ఇలా 13 చిత్రాలొచ్చాయి. వీటిలో క్రాక్, ధమాకా మాత్రమే హిట్. 'ధమాకా'పై విమర్శలున్నప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి కాబట్టి హిట్టే.
(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)
అసలు ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా సరే రవితేజ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అది కూడా స్టార్ హీరోలతో పోలిస్తే వేగంగా. అయితే వేగంగా చేయడం కంటే కంటెంట్ పరంగా ఏది చేస్తున్నాం? ఎలాంటిది చేస్తున్నాం? ప్రేక్షకులకు ఇది నచ్చుతుందా? లాంటి అంశాలు రవితేజ ఓసారి ఆలోచించుకుంటే మంచిదేమో!
రవితేజ అనగానే చాలామంది పాత సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు గానీ కొత్త చిత్రాల్లో ఒక్క దాని గురించి మాట్లాడట్లేదు. రవితేజ వైపు నుంచి యాక్టింగ్ పరంగా ఎలాంటి లోటు అయితే కనిపించట్లేదు. కానీ ఆయనకు తగ్గ సినిమాలే ఎంచుకోవట్లేదు. ఈ విషయంలో రవితేజ కూడా పొరపాటు చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు స్టార్ దర్శకుల్ని రవితేజ వద్దనుకుంటున్నారా? లేదా వాళ్లే రవితేజ దగ్గరకు రావట్లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతే రవితేజ కూడా సగటు హీరోగానే మిగిలిపోతారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా ఓసారి వెనక్కి తిరిగి చూసుకుని ట్రెండ్‌కి దగ్గ దర్శకులు, ట్రెండ్‌కి తగ్గ స్టోరీస్ చేస్తే ఒకటి కాకపోయినా మరొకటి అయినా హిట్ అయి ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. చూడాలి మరి రవితేజ ఏం చేస్తారో?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు)


