ధీరే... ధీరే అంటూ పాట అందుకున్నారు విశ్వక్ సేన్, కయాదు లోహర్. ఈ ఇద్దరూ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఫంకీ’ చిత్రంలోని పాట ఇది. సినిమాలో వచ్చే ఈ తొలి పాటను బుధవారం విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు దర్శకుడు కేవీ అనుదీప్ సాహిత్యం అందించగా సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించారు.
‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘ఫంకీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఈ పాటలో విశ్వక్–కయాదుల జోడీ, పాటలోని కొత్తదనం యువతకు చేరువయ్యేలా ఉంటుంది’’ అని తాజాగా విడుదల చేసిన ‘ధీరే... ధీరే’ పాట గురించి యూనిట్ పేర్కొంది. విభిన్నమైన కథాంశంతో, ఆద్యంతం అలరించే హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమా ఉంటుందని, ‘ఫంకీ’ అనేది ప్రేక్షకులకు ఓ మంచి వినోదాల విందు అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది.


