ఈ–కేవైసీ గడువు 31వరకే...
● త్వరలోనే లబ్ధిదారులకు కార్డులు ● ఇప్పటికే జిల్లాకు చేరిక.. ఆదేశాలు రాగానే పంపిణీ
ఖమ్మం సహకారనగర్: రేషన్ షాపుల ద్వారా బియ్యం అందుకుంటున్న లబ్ధిదారులకు త్వరలో స్మార్ట్ కార్డులు అందనున్నాయి. సుమారు పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు కార్డులు జారీ చేయలేదు. దీంతో అవసరమైన వారు ఈపీడీఎస్ సైట్ ద్వారా కార్డులను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటున్నారు. ఇంకొందరు సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని రేషన్‌షాపుల్లో చూపించి బియ్యం తీసుకుంటున్నారు. ఈక్రమాన ప్రభుత్వం స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
4.72లక్షల కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొందరికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసింది. పాత వారితో పాటు కొత్త కార్డుదారులకు రేషన్‌షాపుల ద్వారా సన్నం బియ్యం అందుతున్నాయి. ఈమేరకు అందరికీ స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలోని 748 రేషన్ షాపుల పరిధిలో 4,72,789 కార్డులు, ఇందులో 13,35,362మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ త్వరలో స్మార్ట్‌కార్డులు అందనున్నాయి. ఇప్పటికే జిల్లాకు పూర్తిగా కార్డులు చేరాయని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మల్లికార్జున్‌బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు.
ఏటీఏం తరహాలో..
తమిళనాడు తదితర రాష్ట్రాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు జారీ చేశారు. ఏటీఎం తరహాలో ఉండే ఈ కార్డుల్లో లబ్ధిదారులు, సభ్యుల పేర్లు, వయస్సు, ఆధార్ నంబర్ ముద్రించి ఉంటుంది. కార్డు ముందు భాగంలో కుటుంబ యజమానితో పాటు, రేషన్‌కార్డు నంబర్ ముద్రించడమే కాక క్యూ ఆర్ కోడ్ కూడా ఉన్నట్లు తెలిసింది.
జిల్లాలో 4,72,789 కార్డులు, 13,35,362మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 26,454కార్డులకు గాను 41,423మంది ఈ–కేవైసీ ఇంకా చేయించుకోలేదు. ఈనెల 31వ తేదీ వరకే గడువు ఉన్నందున త్వరగా చేయించుకోవాలని డీసీఎస్‌ఓ మల్లికార్జున్‌బాబు సూచించారు. లేనిపక్షంలో కార్డు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, విదేశాల్లో ఉంటున్న వారి పేర్లు తొలగించేందుకు ప్రభుత్వం ఈ–కేవైసీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


