ఖమ్మం వైద్యవిభాగం: పిల్లల్లో నులి పురుగుల నివారణే లక్ష్యంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. ఇటీవల మాత్రలు పంపిణీ చేయగా, మిగిలిన పిల్లల కోసం సోమవారం ‘మాప్–అప్ డే’ నిర్వహించగా ఆయన పలు ప్రాంతాల్లో తనిఖీ చేశారు. అలాగే, ఖమ్మం రస్తోగి నగర్, ఎన్నెస్పీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు మాత్రలు అందజేసి మాట్లాడారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
రెండో విడత ఎంఆర్ వ్యాక్సినేషన్
తట్టు – రుబెల్లా(ఎంఆర్) రెండో విడత స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతానికి ప్రణాళిక రూపొందించామని డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 27నుండి మే 4వ తేదీ వరకు నిర్వహించిన మొదటి విడత వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో జిల్లాలోని 443మంది పిల్లలకు గాను 431మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. తట్టు నిర్మూలనకు ఉద్దేశించిన ఎంఆర్ – 1 వ్యాక్సిన్ 116 మంది పిల్లలకు, ఎంఆర్ – 2 వ్యాక్సిన్ 123 మందికి, బీసీజీ 20 మందికి, పెంటావాలెంట్ 159 మందికి, డీపీటీ 159 మంది పిల్లలకు వేశామని తెలిపారు. అలాగే, గర్భిణులు 86 మందికి టీడీ టీకాలు వేయడంతో లక్ష్యం పూర్తయిందని వివరించారు. ఈనెల 27వ తేదీ వరకు జరిగే రెండో విడతను సైతం విజయవంతం చేసేలా ఉద్యోగులకు సూచనలు చేసినట్లు తెలిపారు.


