ఇతర ఖర్చులు కలిపి మక్కలపై క్వింటాకు రూ.300 నష్టం
ఖమ్మం వ్యవసాయం: ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలను టెండర్ల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలకు విక్రయించింది. క్వింటాకు రూ.2,200 చొప్పున టెండర్లు వేసిన వారు మక్కలను కొనుగోలు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా గడిచిన యాసంగి సీజన్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.17 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు ఏకంగా 45 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా ప్రైవేట్ మార్కెట్‌లో మద్దతు ధర లేనందునప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా రూ.2,400తో కొనుగోలు చేసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50,258 మంది రైతుల నుంచి రూ.796 కోట్ల విలువైన 3.31 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ఈక్రమంలో ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే క్వింటాకు రూ.2,200 చొప్పున ఏజెన్సీలు దక్కించుకున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 కాగా, రవాణా, నిల్వ తదితర చార్జీలు మరో రూ.100 వరకు ఉంటాయి. అంటే క్వింటాకు రూ.2,500 కాగా, రూ.2,200కు అమ్మడంతో క్వింటాకు రూ.300 మేర నష్టం ఎదురవుతోంది.
కాగా, మార్కెట్‌లో అయితే మక్కలకు డిమాండ్ ఉన్నా ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు సిండికేట్ కావడంతోనే తక్కువ ధర కోట్ చేశారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌లోని ఓపెన్ షెడ్లలో నిల్వ ఉన్న మక్కలను కాంట్రాక్టర్లు తీసుకెళ్లే వరకు క్రిమికీటకాలు ఆశించకుండా ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా క్రిమిసంహారక మందు పిచికారీ చేయిస్తున్నారు.


