నీరు జారిపోకుండా.. | - | Sakshi
Sakshi News home page

నీరు జారిపోకుండా..

Jul 22 2026 12:18 AM | Updated on Jul 22 2026 12:18 AM

తాగునీటికే ప్రాధాన్యత

గోదావరి నీటి విడుదల, రిజర్వాయర్లలో నిల్వలు

పాలేరులో 75 రోజులకు ఓకే..

ఖమ్మం వైపు కూడా మళ్లింపునకు యత్నాలు పూర్తిగా తాగునీటి వినియోగానికే నిర్ణయం ఎల్‌నినో నేపథ్యాన సమస్య రాకుండా జాగ్రత్తలు

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రతీ నీటి

బొట్టును ఒడిసి పట్టి తాగునీటి అవసరాలకు వినియోగించడంపై జల వనరుల శాఖ

అధికారులు దృష్టి సారించారు. నాగార్జున

సాగర్‌ ప్రాజెక్టులో నీటి కొరతతో ఈసారి

కృష్ణా జలాలు పాలేరు రిజర్వాయర్‌కు చేరే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యాన సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న గోదావరి జలాలను ఏన్కూరులోని రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా వైరా, లంకాసాగర్‌ ప్రాజెక్టుల్లో నింపుతున్నారు. ఈ నీటితో వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలను తీర్చనుండగా.. పాలేరు

రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలకు విడుదల చేస్తారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

భయపెడుతున్న ఎల్‌నినో..

ఎల్‌నినో ప్రభావం జిల్లాపై తీవ్రంగానే ఉండే అవకాశముందని చెబుతున్నారు. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా వానాకాలంలో తాగునీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జిల్లాలో పరిస్థితులపై మంత్రులు సమీక్ష నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సైతం అధికారులతో జిల్లాలో తాగునీటి సరఫరా అంశాలపై సమీక్షించారు. ఈ నేపథ్యాన గోదావరి జలాలను కేవలం తాగునీటికే వినియోగించాలని నిర్ణయించారు.

రిజర్వాయర్లలోకి బిరబిరా..

వర్షాభావంతో సాగర్‌ జలాలు వచ్చే అవకాశం లేనందున సాగు అవసరాల కోసం ఈ నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ పంపుహౌస్‌ నుంచి నీరు విడుదల చేశారు. ఏన్కూరు లింక్‌ కెనాల్‌ నుంచి సాగర్‌ ప్రధాన కాల్వకు ఈ నీరు మళ్లించారు. అయితే తాజా పరిస్థితుల ఆధారంగా ఈ నీటిని తాగునీటి కోసమే వినియోగించాలని నిర్ణయించారు. ఈ నెల 11వ తేదీ నుంచి రోజుకు 550 క్యూసెక్కుల చొప్పున వైరా రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా.. గోదావరి జలాలు రాకముందు 13.7 అడుగులే ఉంది. ప్రస్తుతం 16 అడుగులకు చేరగా, 17 అడుగులకు చేరేవరకు నీటి విడుదల కొనసాగిస్తారు. ఇక లంకాసాగర్‌ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 16 అడుగులు కాగా.. ప్రస్తుతం 7.6 అడుగుల మేర ఉంది. రోజుకు 200 క్యూసెక్కుల గోదావరి జలాలు వస్తుండడంతో 10 అడుగులకు చేరే వరకు నీరు చేరుస్తారు.

ఎక్కడా ఇబ్బంది లేకుండా..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీరు విడుదలయ్యే అవకాశాలు దాదాపు లేకపోవడంతో గోదావరి జలాలను తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం మొదటి విడతగా వచ్చిన వేయి క్యూసెక్కుల నీటితో వైరా పరిసర ప్రాంతాలతోపాటు తల్లాడ, మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌ మండలాల తాగునీటి అవసరాలను తీర్చనున్నారు. ఇక లంకాసాగర్‌ ప్రాజెక్టు ద్వారా కల్లూరు, పెనుబల్లి, వేంసూరు చెరువులను నింపి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటికి సరఫరా చేస్తారు. సత్తుపల్లి పరిధిలో 200 చెరువులు ఉంటే.. అందులో 36 చెరువులు 70 – 90 శాతం నిండాయి. గోదావరి జలాలతో చెరువులు నిండుతుండడంతో భూగర్భ జలాలు కూడా పెరగనున్నాయి. ఎక్కడా నీరు వృథా కాకుండా జలనవరుల శాఖతోపాటు వ్యవసాయ, విద్యుత్‌, మున్సిపల్‌, పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

గోదావరి నుంచి విడుదలవుతున్న నీటిని తాగు అవసరాలకే వినియోగించాలని నిర్ణయించాం. ఎక్కడా చుక్క వృథా కాకుండా పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం సాగర్‌ జలాలు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే, పాలేరు

రిజర్వాయర్‌లో 75 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో తాగు అవసరాలకు

ఈ నీటిని వినియోగిస్తాం. డిసెంబర్‌ వరకు

ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం.

– మంగళపూడి వెంకటేశ్వర్లు,

సీఈ, జలవనరుల శాఖ

సీతారామ నుంచి విడులైన నీరు 1 టీఎంసీ

వైరా రిజర్వాయర్‌కు 0.6 టీసీఎం

లంకాసాగర్‌ ప్రాజెక్టుకు 0.4 టీఎంసీ

వైరా రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు

ప్రస్తుత నీటిమట్టం 16 అడుగులు

లంకాసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులు

ప్రస్తుత నీటిమట్టం 7.6 అడుగులు

పాలేరు రిజర్వాయర్‌ ద్వారా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో 75 రోజులకు సరిపడా నీటినిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా పరిస్థితిని ఎదుర్కొనేలా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. సీతారామ నుంచి వస్తున్న గోదావరి జలాలను వెంకటాయపాలెం డీప్‌కట్‌ ద్వారా ఖమ్మం తరలించే మార్గాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే తాగునీటికి కటకట ఏర్పడితే రోజు విడిచి రోజు నీటి విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్‌ వరకు జిల్లాలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

వైరా, లంకాసాగర్‌ ప్రాజెక్టుల్లోకి గోదావరి జలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement