● మధిర ప్రజాప్రతినిధులు, నేతల మధ్య పోరు ● మున్సిపల్ పాలకవర్గం, డెవలప్‌మెంట్ కమిటీ నడుమ విభేదాలు
మధిర: మధిర మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు గడవకముందే కౌన్సిలర్ల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్‌కు మద్దతుగా కొందరు... డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య అనుచరుడికి ఇంకొందరు మద్దతుగా నిలవడంతో వర్గపోరు మొదలైంది. దీంతో ఉపముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ఏం జరుగుతుందోనన్న చర్చ కొనసాగుతోంది.
కాంగ్రెస్ నుంచి తొలి పాలకవర్గం
మధిర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగానే కాక కీలకమైన ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి పదవులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యాన వివిధ అభివృద్ధి పనులకు పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేశారు. ఇక మధిర మున్సిపాలిటీ ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ పాలకవర్గం ఏర్పడింది. దీంతో మున్సిపాలిటీ దశాదిశ మారుతుందని అంతా ఆశించారు. అనుకున్నట్లుగానే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్, వైరా నదికి రిటైనింగ్ వాల్, కోర్టు, బస్టాండ్ నిర్మాణం తదితర పనులకు నిధులు మంజూరయ్యాయి.
కమిటీ ఏర్పాటుతో గుర్రు
మున్సిపాలిటీ పరిధిలో సమస్యల గుర్తింపు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం మున్సిపల్ ఎన్నికలకు ముందే అన్ని పార్టీల నాయకులతో ‘మధిర పట్టణ డెవలప్‌మెంట్ కమిటీ’ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లడమే కాక అభివృద్ధి పనులు నాణ్యత జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. తొలినాళ్లతో అంతా బాగానే సాగినా... ఇటీవల మున్సిపల్ పాలకవర్గంలోని కొందరికి డెవలప్‌మెంట్ కమిటీతో పొసగడం లేదని తెలిసింది. మంజూరైన అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా వెల్లడించాలని ఓ వర్గం నాయకులు సూచిస్తున్నారు. కానీ చైర్‌పర్సన్ మాత్రం అభివృద్ధి పనుల వివరాలు మున్సిపల్ కార్యాలయంలోనే విడుదల చేయాలనే వాదన తెరపైకి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇటీవల మధిరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కాగా, వివరాల వెల్లడికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాలని సూచిస్తే ఆమె గైర్హాజరైనట్లు సమాచారం. కొన్నాళ్ల క్రితం రెండు వర్గాల వారు డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేయడంతో చైర్‌పర్సన్ ఏ వార్డులో పర్యటించినా అక్కడి కౌన్సిలర్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు, డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులకు ఒక రోజు ముందు సమాచారం ఇవ్వాలని భట్టి సూచించినా స్పందించలేదని సమాచారం. కాగా, అంతర్గత రహదారుల అభివృద్ధికి ఇటీవల రూ.62 కోట్లు మంజూరు చేయగా, వార్డుల వారీగా పనుల గుర్తింపునకు కౌన్సిలర్లతో మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమాచారాన్ని గంటల ముందే చెప్పడంతో చాలామంది మరోరోజు నిర్వహించాలని సూచించినా ఆమె కొనసాగించినట్లు తెలిసింది. ఈనేపథ్యాన పాలకవర్గం – డెవలప్‌మెంట్ కమిటీ మధ్య వివాదాన్ని భట్టి ఎలా పరిష్కరిస్తారోనని పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.


