ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ(పీసీపీఎన్‌డీటీ) చట్టాన్ని పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ రామారావు సూచించారు. ఖమ్మంలోని కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో స్కానింగ్ కేంద్రాల పనితీరు, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యలు, అల్ట్రాసౌండ్ కేంద్రాల్లో తనిఖీలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, చేయించడం చట్టరీత్యా నేరమనే విషయమై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఈమేరకు టాస్క్‌ఫోర్స్ బృందాల ద్వారా అల్ట్రాసౌండ్ కేంద్రాల్లోవిస్తృత తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఆడ శిశువు రక్షణను ప్రతీఒక్కరు సామాజిక బాధ్యతగా భావిస్తూ, సమాజంలో బాలికలపై వివక్షకు తావు లేకుండా చూడాలని తెలిపారు. కాగా, ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 13 సెంటర్ల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సమావేశంలో సభ్యులైన వైద్యులు ఎల్.వేణుగోపాలరెడ్డి, బిందు, లక్ష్మీనారాయణ, రేష్మాబేగం, శ్రీవిద్య, అరుణాదేవి, ప్రదీప్‌బాబు, దుర్గ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


