డిజిటలైజేషన్‌ వేగంగా చేయాలి | - | Sakshi
Sakshi News home page

డిజిటలైజేషన్‌ వేగంగా చేయాలి

Jul 22 2026 12:18 AM | Updated on Jul 22 2026 12:18 AM

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలో ఎస్‌ఐఆర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమాన్ని వేగంగా చేపడుతూ ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో ఎస్‌ఐఆర్‌ పురోగతి, ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌, ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించి సూచనలు చేశారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. మాట్లాడుతూ జిల్లాలో ఫారాల డిజిటలైజేషన్‌ 80శాతం పూర్తికాగా, కేఎంసీ పరిధిలో 65 శాతంగా నమోదైందని తెలిపారు. జిల్లా నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన, మరణించిన ఓటర్లు 55 వేల మంది ఉందని చెప్పారు. సోమవారం ఒకేరోజు 20 వేల మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్‌ చేయగా, ఇదే వేగంతో పూర్తిచేస్తామని తెలిపారు. కాగా, వీసీ అనంతరం కలెక్టర్‌ దివాకర అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, 50 శాతం కంటే తక్కువ పురోగతి ఉన్న పోలింగ్‌ స్టేషన్లను గుర్తించాలని సూచించారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్‌, ఎస్‌డీసీ సదానందం, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ పాల్గొన్నారు.

బ్లాక్‌స్పాట్ల వద్ద రక్షణ చర్యలు

ఖమ్మంఅర్బన్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు బ్లాక్‌స్పాట్లు, హైవేలపై రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ దివాకర ఆదేశించారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ ఇప్పటికే గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన చర్యలను చేపట్టాలని తెలిపారు. జాతీయ రహదారుల వెంట ప్రతీ 40 – 50 కిలోమీటర్లకు ఒక పార్కింగ్‌, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలు కల్పించాలని సూచించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ నిబంధనలను అమలు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై జరిమానా విధించాలని తెలిపారు. ఈ సమావేశంలో సీపీ సునీల్‌దత్‌, ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ యుగంధరరావు, డీఎంహెచ్‌ఓ రామారావు, నేషనల్‌ హైవే పీడీ దివ్య తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement