సాగాలా.. ఆగాలా?
జిల్లాలో ప్రధాన పంటల సాగు పరిస్థితి (ఎకరాల్లో)
● జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం ● మెట్ట పంటలు సాగుచేస్తున్న రైతుల్లో ఆశలు ● వరి సాగుపై మాత్రం ఊగిసలాట
ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుతం కురుస్తున్న వానలు అన్నదాతల ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. దాదాపు 20 రోజులకు పైగా ముఖం చాటేసిన వరుణుడు ప్రస్తుతం కరుణ చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఎల్‌నినోతో వర్షాబావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అయితే జిల్లాలో జూన్‌లో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు నాటారు. ఈ పంట సాధారణ విస్తీర్ణం 2,36,908 ఎకరాలకు గాను ఇప్పటివరకు 2,28,079 ఎకరాల్లో పంట వేశారు. అలాగే, పెసర 18,174 ఎకరాలకు గాను 21,464 ఎకరాల్లో విత్తనాలు వేశారు. వేశారు. ఇంకొందరు మినుము, కంది, మొక్కజొన్నతో పాటు చెరకు కూడా వేశారు. ఈపంటలకు ప్రస్తుత వర్షం ఊపిరి పోస్తున్నా, వరి సాగుపై మాత్రం స్పష్టత రావడం లేదు. మరోపక్క ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా వరి సాగు చేయొద్దని, ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేసే అవకాశం లేదని చెబుతుండడంతో రైతుల్లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఆశల జల్లులు
కొద్ది రోజులుగా అల్పపీడనం కారణంగా కురుస్తున్న జల్లులు పంటల సాగుపై ఆశలు చిగురింపజేస్తున్నాయి. మూడు రోజులుగా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. అయితే వరద ప్రవహించేలా మాత్రం వాన రావడం లేదు. జూన్‌లో వేసిన పత్తి, పెసర వంటి మెట్ట పైర్లకు ఈ వానలు ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో –25.4 లోటు వర్షపాతమే ఉంది. కామేపల్లి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, ఏన్కూరు, కల్లూరు, తల్లాడ, బోనకల్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా నమోదైంది. ఎర్రుపాలెం మండలంలో అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలో 56.5, తిరుమలాయపాలెంలో 43.2, ఖమ్మం అర్బన్‌లో 38.4, కొణిజర్లలో 29.8, వేంసూరులో 28.2, తల్లాడలో 26.2, కామేపల్లిలో 23.4, రఘునాథపాలెంలో 20.8, సింగరేణిలో 20.2 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, మిగిలిన మండలాల్లో తేలికపాటి వర్షం కురవడం సాగులో ఉన్న పంటలకు ఉపయోగపడుతోంది.
పంటలకు ఎరువులు
ప్రస్తుతం కురుస్తున్న వానలతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పత్తి వంటి పైర్లకు ఎరువులు వేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల పత్తిలో పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
వరి సాగుపై మాత్రం రైతుల్లో ఊగిసలాట నెలకొంది. ఓ వైపు ప్రభుత్వం వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. కానీ రైతులు వానలపై ఆశలు పెంచుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ పద్ధతుల్లో 42 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మరో లక్ష ఎకరాల వరకు అవసరమైన నార్లు సిద్ధం ఉన్నాయి. బోర్లు, బావులు, వాగుల ఆధారంగా వరి సాగుకు సిద్ధమవుతున్నా... మున్ముందు వానలు లేకపోతే నష్టం వస్తుందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
పంట సాగు అంచనా సాగైన విస్తీర్ణం
వరి 3,05,366 42,446
పత్తి 2,36,908 2,28,079
పెసలు 18,174 21,464
చెరకు 1,181 1,188
మొక్కజొన్న 4,225 353
కంది 451 228
మినుము 221 197


