‘మక్తల్‌’ ఎత్తిపోతల వేగం పెంచండి | CM Revanth Reddy order to officials on Maktal lift irrigation scheme | Sakshi
Sakshi News home page

‘మక్తల్‌’ ఎత్తిపోతల వేగం పెంచండి

Jul 22 2026 2:35 AM | Updated on Jul 22 2026 2:35 AM

CM Revanth Reddy order to officials on Maktal lift irrigation scheme

హకీంపేటలో ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణంపై అధికారులకు సూచనలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

యుద్ధ ప్రాతిపదికన పథకం పూర్తి చేయండి 

సెప్టెంబర్‌లోపు భూసేకరణ క్లియర్‌ కావాలి 

అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

కొడంగల్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్ష 

హకీంపేటలో ఎడ్యుకేషన్‌ హబ్‌ పనుల పరిశీలన

కొడంగల్‌/దుద్యాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన మక్తల్‌ – నారాయణపేట– కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషన్‌ హబ్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. కొడంగల్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కడా) ఆధ్వర్యంలో చేపట్టిన పనుల తీరుతెన్నులపై చర్చించారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెప్టెంబర్‌లోపు భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో నిర్లక్ష్యం వహించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. 2027 డిసెంబర్‌లోపు ఎంత మేరకు పనులు పూర్తి చేస్తారో రాత పూర్వకంగా నివేదిక ఇవ్వాలని చెప్పారు. మూడు నియోజకవర్గాలకు ప్రాణాధారమైన పథకంపై అలసత్వం తగదన్నారు. దీనికి సంబంధించి అదనపు పంపుల ఏర్పాటు కోసం అవసరమైన సివిల్‌ పనులకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చి పూర్తి చేయించాలని చెప్పారు. కాగా మొదటి దశ పనులను డిసెంబర్‌ వరకు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి ఇంజనీరింగ్‌ అధికారులు హామీ ఇచ్చారు. 

ఔటర్‌ రింగ్‌ రోడ్ల డిజైన్లు రూపొందించండి.. 
రంగారెడ్డి– వికారాబాద్‌– నారాయణపేట ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మాణంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంగా చర్చించి డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించిన భూ సేకరణను వేగవంతం చేయాలని చెప్పారు. ఇది పూర్తయిన వెంటనే టెండర్‌ ప్రాసెస్‌ మొదలు పెట్టాలన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో చేపట్టిన మల్టీపర్పస్‌ ఇండ్రస్టియల్‌ పార్క్‌కు అవసరమైన భూసేకరణపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబై– పుణె కనెక్టివిటీ మాదిరిగానే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కొడంగల్‌ వరకు నిర్మించనున్న రేడియల్‌ రోడ్డుపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఇండస్ట్రియల్‌ పార్కులు, ఎడ్యుకేషన్‌ హబ్‌ అభివృద్ధి పనులకు కనీసం 5 వేల నుంచి 10 వేల ఎకరాల భూమిని సేకరించాలని సూచించారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల ఇండ్రస్టియల్‌ పార్క్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. 

దేశానికే తలమానికంగా ఎడ్యుకేషన్‌ హబ్‌ 
హకీంపేట, లగచర్ల, పోలేపల్లి శివారులో రూ.5 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్‌ హబ్‌ దేశానికే తలమానికం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అసహనం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది మార్చిలోపు పనులన్నీ పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, బి.మనోహర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దానకిషోర్, వికాస్‌రాజ్, ముఖ్య కార్యదర్శులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, ఎన్‌.శ్రీధర్, పలువురు ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement