ఖమ్మంవ్యవసాయం: అల్పపీడనం కారణంగా సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు జల్లులు కురుస్తున్నాయి. అయితే, సోమవారం మాత్రం ఓ మోస్తరు వర్షం కురవడంతో సాగులో ఉన్న పంటలకు ప్రాణం పోసినట్లయింది. జూన్‌లో కురిసిన వర్షాలతో జిల్లాలో 3లక్షల ఎకరాల్లో పంటలు సాగుకాగా, ఇందులో అత్యధికంగా 2.30 లక్షల ఎకరాల్లో పత్తి ఉంది. అయితే, ఇటీవల వర్షాల జాడ లేకపోగా.. వేసవిని తలపించేలా ఎండలు నమోదవుతున్నాయి. ఈక్రమాన పంటలు వడబడుతున్న క్రమాన వర్షం కురవడంతో రైతులు ఎరువులు వేస్తున్నారు. విత్తనాలు మొలకెత్తని చోట మరోసారి విత్తనాలను నాటుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులే ఉంటాయని, వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. కానీ ప్రస్తుతం కురుస్తున్న వానలతో రైతులు డోలాయమానంలో ఉన్నారు.
ఖమ్మం పరిసరాల్లో..
ఖమ్మం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. గంట పాటు వర్షం కురవడంతో ఉక్కపోతతో ఇబ్బంది జనానికి ఊరట లభించినట్లయింది. రాత్రి 9 గంటల సమయానికి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం ఖానాపురంలో అత్యధికంగా 46.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 44.8, తిరుమలాయపాలెంలో 25.5, కలెక్టరేట్ వద్ద 25, రఘునాథపాలెంలో 17.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే, రఘునాథపాలెంలోని పలు గ్రామాలతో పాటు వేంసూరు, తల్లాడ, కొణిజర్ల, ముదిగొండ, వైరా, కారేపల్లి, కూసుమంచి, కామేపల్లి, కల్లూరు మండలాల్లో కూడా ఓ మోస్తరు వర్షం కురిసింది.
జిల్లాలోని పలుచోట్ల వర్షం


