సాగుకు నీరు లేదు.. | - | Sakshi
Sakshi News home page

సాగుకు నీరు లేదు..

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

ఎల్‌నినో, వర్షపాతం లోటును ఎదుర్కొనేలా కార్యాచరణ

వరి సాగు చేయకుండా

రైతులకు విస్తృత అవగాహన

ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వరి సాగుతో నష్టపోవద్దు...

నీరు వచ్చే పరిస్థితి లేదు

ఖమ్మం సహకారనగర్‌: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యాన వాస్తవాలను క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు చేరవేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులపై శాసీ్త్రయ అంచనాలు, క్షేత్రస్థాయి వాస్తవాలపై అంచనాకు వచ్చిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం ఎల్‌నినో సంసిద్ధతమై ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్‌, ఉద్యానశాఖ డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్‌ దురిశెట్టి, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర టీ.ఎస్‌., అంకిత్‌, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు రాందాస్‌ నాయక్‌, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఏడాది ప్రణాళిక ఉండాలి

రానున్న మూడు నెలలకే పరిమితం కాకుండా కనీసం ఏడాది కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. మండలాల వారీగా పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి వర్షపాతం, తాగునీరు, భూగర్భ జలాలు, విద్యుత్‌ సరఫరా, పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఖమ్మం కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ వరకు పప్పుధాన్యాలు, అలసంద, కందులు, పెసర వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తొలుత పెద్దపల్లి జిల్లాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ సంపత్‌ ఎల్‌నినో పరిస్థితులపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈనెల 15నాటికి ఉమ్మడి జిల్లాలో 35 శాతం లోటు వర్షపాతం ఉన్నా, రైతులు ప్రస్తుతం పత్తి అధికంగా సాగు చేశారని తెలిపారు. వర్షాలు వస్తే వరి సాగుకు సిద్ధమవుతున్నారని, భూగర్భ జలాలు ఉన్న వారు నార్లు పోశారని అధికారులు వివరించారు. అనంతరం తెలంగాణ జలసిరి, ఎల్‌నినో సూపర్‌ స్థితిలో తీసుకునే చర్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు. ఇంకా ఈ సమావేశంలో పోలీస్‌కమిషనర్‌ సునీల్‌దత్‌, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్‌, అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగులు, సుడా, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పి.దుర్గాప్రసాద్‌, ఖాదర్‌ బాబా కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య తదితరులు పాల్గొన్నారు.

సాగర్‌, పాలేరు నుంచి రావడం కష్టమే..

వర్షాభావంతో రానున్న రెండు నెలల్లో భూగర్భజలాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగు చేసి నష్టపోవద్దని డిప్యూటీ సీఎం భట్టి కోరారు. ఈ విషయమై ప్రతీ రైతుకు సమాచారం చేరవేస్తూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నీటి వనరుల లభ్యత, జలాశయాల్లో నీటి నిల్వ లు, భూగర్భ జలాల పరిస్థితిపై సమగ్ర నివేదికను అందుబాటులో ఉంచాలన్నారు. రాజీవ్‌ లింక్‌ కాల్వ ద్వారా గోదావరి జలా లను జిల్లా అవసరాలకు వినియోగించడంపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రతీ గ్రామంలో వర్షపాతం పరిస్థితులు, నీటి వనరుల లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నీటి లభ్యత ఆధారంగానే పంటలు ఎంపిక చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు. ప్రస్తుతం సాగర్‌ ప్రాజెక్టు నుంచి సాగునీరు వచ్చే పరిస్థితి లేదని, పాలేరు ఆయకట్టుకు కూడా నీరు అందుబాటులో ఉండదని రైతులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. నీరు అధికంగా అవసరముండే వరి తదితర పంటలను ప్రోత్సహించకుండా, పెసర, మినుములు, కందులు, అలసంద, చిరుధాన్యాలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. బోర్ల ఆధారంగా వరి సాగు చేస్తే ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో నీటి సమస్య మరింత తీవ్రమైతే ఇబ్బంది పడతారని తెలిపారు. ఈమేరకు రైతు వేదికల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇదే సమయాన ఉమ్మడి జిల్లాల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం వైరా, లంకా సాగర్‌ జలాశయాలను తాగునీటి అవసరాల కోసమే నింపుతున్నామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement