పెట్టిన పెట్టుబడికి రెండింతల లాభం పొందే మహా స్కెచ్ ఇది. మిగిలిన దొడ్డు బియ్యాన్ని సీఎంఆర్‌గా ఇచ్చే కుట్ర జరుగుతుందా..? రీపాలిషింగ్ చేసి బహిరంగ మార్కెట్లో వివిధ బ్రాండ్ల పేరిట ప్రజలపై వదలనున్నారా..? ఇటీవల జరిగిన దొడ్డు బియ్యం టెండర్ దక్కించుకున్న జిల్లాకు చెందిన బడా మిల్లర్ ప్రణాళిక ఇదేనా అంటే.. అవుననే సంకేతాలిస్తున్నాయి. ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుండడంతో.. దొడ్డు బియ్యం నిల్వలు భారీగా ఉన్నాయి. సదరు బియ్యాన్ని వేలం వేసి ఖజానాను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పిలవడం.. ఎవరూ బిడ్లు వేయలేదు. మళ్లీ టెండర్ పిలవడంతో బియ్యం వ్యాపారంలో నిష్ణాతుడైన బడా రైస్ మిల్ల ర్ చక్రం తిప్పి దక్కించుకున్నాడు. నిబంధనల ప్రకారం వ్యాపారం జరుగుతుందా..? మూడు, నాలుగు రోజుల మౌనం తదుపరి యథా కార్యకలాపాలకే దారులు తెరుచుకుంటాయా అన్న అనుమానాలు పుష్కలం.
కరీంనగర్ అర్బన్: సివిల్ సప్లయ్ కార్పొరేషన్ నిర్వహించిన టెండర్‌లో జిల్లాకు చెందిన బడా రైస్ మిల్లర్ దొడ్డు బియ్యాన్ని దక్కించుకున్నాడు. క్వింటాల్‌కు రూ.2,170 చొప్పున 56,555 టన్నుల దొడ్డు బియ్యాన్ని సుమారు రూ.122కోట్లకు కొనుగోలు చేశాడు. తొలుత వేలంలో కిలో ధర రూ.24 గా నిర్ణయించగా.. ఎవరూ ముందుకు రాలేదు. మళ్లీ వేలానికి పిలవగా.. ధర రూ.21.60గా నిర్ణయించారు. సదరు మిల్లర్ చక్రం తిప్పి బిడ్లు దాఖ లు చేసి 56,555 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం దక్కించుకున్నాడు. కరీంనగర్‌తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని హెచ్చు శాతం నిల్వలు వీటి కిందకే వస్తాయి. నిబంధనల ప్రకారం 5 శాతాన్ని అడ్వాన్సుగా చెల్లించగా.. మిగతా మొత్తాన్ని ఆగస్టు నెలాఖరు వరకు విడతలవారీగా చెల్లించాలని నిర్దేశించారు. ఈ వ్యవహారం వెనుక కీలక వ్యక్తులు క్రియాశీల పాత్ర పోషించగా.. బడా రైస్ మిల్లర్ షేర్ 60 శాతమని తెలుస్తోంది.
ఏం చేయాలి..
టెండర్ నోటిఫికేషన్‌లో రైస్ ట్రేడర్స్, బల్క్ బయ్య ర్స్, కేంద్ర, రాష్ట్ర సహకార సంస్థలు, ఇతర సహకార సంఘాలు, బేవరేజ్, డిస్టిలరీ కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర సహకార సంఘాలు, ఇథనాల్ కంపెనీల యాజమాన్యాలు పాల్గొనొచ్చని ఉంది. ఆ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాలు, ఇతర రైస్ మిల్లర్లకు విక్రయించొద్దని స్పష్టంగా పేర్కొన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీలు, పశువులు, చేపలు, కోళ్ల దాణా వంటి అవసరాలకు విక్రయించాలనేది నిబంధన.
భారీ స్కెచ్
నిబంధనల ప్రకారం వ్యాపారం చేస్తే లాభాలు అంతంతమాత్రమే కాగా.. సదరు వ్యాపారి భారీ స్కెచ్ కు తెర లేపాడని తెలుస్తోంది. జిల్లాలో 71 మంది రైస్ మిల్లర్లు డిఫాల్టర్లుగా ఉండగా.. రూ.200కోట్ల కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఇవ్వాల్సి ఉంది. ఇదే అదునుగా భావించిన మిల్లర్ దక్కించుకున్న దొడ్డు బియ్యాన్ని రీపాలిషింగ్ చేసి ఆయా మిల్లులకు సరఫరా చేసే భారీ కుట్ర చేశారన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. రీపాలిషింగ్ ద్వారా బియ్యం సన్నగా మారనుండగా.. 45వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రాబట్టే అవకాశముంది. రీపాలిషింగ్ కోసం అనుమతి కోరడం.. 11 మిల్లులకు అనుమతివ్వడం జరిగిపోయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అంతలోనే అనుమతి రద్దు చేశారు. దీంతో బడా మిల్లర్ స్కెచ్ బెడిసికొట్టగా.. తదుపరి సన్న బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో వివిధ రకాల పేర్లతో వ్యాపారం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రీపాలిషింగ్ అనుమతి రద్దు చేశామని అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చితే సహించమన్నారు.


