కరీంనగర్‌టౌన్: ఎస్సీ, ఎస్టీల సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో స్వామి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ డీసీపీ వెంకటరమణతో కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ బాధితులను గౌరవంగా కూర్చోబెట్టి వారి సమస్యలను ఓపికగా వింటేనే వారికి న్యాయం జరిగిందనే నమ్మకం కలుగుతుందని, వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. అట్రాసిటీ నిరోధక చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. తహసీల్దార్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులను అత్యంత సున్నితంగా పరిష్కరించాలని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కులాంతర వివాహ ప్రోత్సాహకం, ఓవర్సీస్ విద్యా పథకం, స్కాలర్‌షిప్‌లు, ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం తదితర పథకాలకు సంబంధించిన పెండింగ్ నిధుల వివరాలను వెంటనే ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ కమిషనర్, కమిషన్‌కు పంపాలని ఆదేశించారు. పీఎం–అజయ్ పథకం, అసైన్డ్ భూములు, ఎల్‌పీఎస్ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఎంపీడీవోల పర్యవేక్షణలో సమర్థంగా అమలు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతినెల ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో అమలవుతున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన మూడు పట్టణ స్థానిక సంస్థల్లో రూ.30 లక్షల యూబీఐ బీమా సదుపాయాన్ని అమలు చేయాలన్నారు. కరీంనగర్ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ కమిషన్ సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని, పెండింగ్ నిధుల పూర్తి వివరాలను నిర్ణీత సమయంలో కమిషన్‌కు సమర్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, ఎస్సీ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ భాగ్యలక్ష్మి, డిస్ట్రిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వివిధ సమస్యలను పరిష్కరించారని దళితనాయకులు వినతి పత్రాలు ఇచ్చారు.


