ప్రారంభం ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

ప్రారంభం ఎప్పుడు?

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

100 పడకలు..

చొప్పదండిలో పూర్తయిన 100 పడకల ఆస్పత్రి

వైద్య విధాన పరిషత్‌లో మొదలైన అంతర్గత బదిలీలు

ప్రారంభమైన ఆప్షన్లు, ఆన్‌లైన్‌లో కానరాని చొప్పదండి ఆస్పత్రి

ఈ ఏడాది భర్తీ కాకపోతే మరో మూడేళ్ల వరకు ఆగాల్సిందే

వెంటనే ప్రారంభించాలని వైద్యసిబ్బంది, స్థానికుల డిమాండ్‌

100 పడకలు..

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

చొప్పదండి 100 పడకల ఆస్పత్రి దాదాపు పూర్తయింది. చిన్నాచితకా పనులు మిగిలి ఉండగా తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి ప్రారంభం విషయం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో రీ–డిప్లాయ్‌మెంట్‌ (ఉద్యోగుల అంతర్గత సర్దుబాటు) మొదలైన దరిమిలా ఆస్పత్రి నిర్మాణంపై జోరుగా చర్చ సాగుతోంది. ఆసుపత్రి నిర్మాణం 99శాతం మేర పూర్తయింది. మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.4.5 కోట్లు కేటాయించింది. ఇటీవల రూ.1.67 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులతో ఇప్పటికే పలు పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణం తుదిదశకు వచ్చిన నేపథ్యంలో వెంటనే ప్రారంభించాలన్న చర్చ స్థానికంగా ఊపందుకుంది. మిగిలిన పనులు పూర్తయ్యేసరికి మరో రెండు నెలలు పడుతుందని, ఆ తరువాతే ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు అప్పగిస్తుందని, అప్పటి వరకు ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన సిబ్బంది కేటాయింపులు ఉండవన్న ప్రచారం మొదలైంది.

ఆన్‌లైన్‌లో కానరాని చొప్పదండి

ఇదే సమయంలో కరీంనగర్‌ జిల్లా వైద్యవిధాన పరిషత్‌లో అంతర్గత బదిలీలు మొదయ్యాయి. 17వ తేదీన రీ డిప్లాయ్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభమవగా.. ఆప్షన్ల ఎంపిక కోసం 18నుంచి ఉద్యోగులకు లింకులు పంపించారు. ఈ లింకులను క్లిక్‌ చేసి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఎంట్రీ చేస్తే.. ఆప్షన్లలో చొప్పదండి కానరావడం లేదు. దీంతో వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఈ అంతర్గత బదిలీలను మూడేళ్ల కిందనే చేపట్టాల్సి ఉన్నా.. వరుస ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తూ వచ్చారు. తీరా ఇప్పుడు చేపట్టాక చొప్పదండి కనిపించడం లేదు. ఇప్పుడు అవకాశం లేకపోతే మరో మూడేళ్ల దాకా ఆసుపత్రిలో శాశ్వత ప్రాతిపదికన కేటాయించే పరిస్థితి ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే చొప్పదండి నియోజకవర్గంతోపాటు జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల నుంచి వైద్యం కోసం కరీంనగర్‌కు రాకుండా 22 కిమీ ముందే చికిత్స లభించనుంది. వివిధ విభాగాల్లో సీనియర్‌ సర్జన్ల నుంచి కిందిస్థాయి సిబ్బంది దాకా దాదాపు 104 మంది వరకు ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన నియమించే వీలుంది. ప్రస్తుత బదిలీలల్లో ఖాళీల భర్తీ వీలుకాకపోతే డిప్యూటేషన్‌ మీద వైద్యులను నియమించాల్సి వస్తుందని, వారుపూర్తి కాలం పనిచేయకుండానే వెనుదిరిగే అవకాశాలు అధికమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సిబ్బంది కేటాయింపుపై డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఫర్‌ హెల్త్‌ సర్వీసెస్‌ కృష్ణప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement