కరీంనగర్ సిటీ: విద్యార్థులలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు అధునాతన సింథటిక్ ట్రాక్ దోహదపడుతుందని శాతవాహన యూ నివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. శాతవాహన క్రీడా మైదానంలో సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ పనులకు రిజిస్ట్రార్ సతీశ్ కుమార్‌తో కలిసి శనివారం భూమి పూజ చేశారు. ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ క్రీడా వసతులను బలోపేతం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన, బలమైన యువతను దేశానికి అందించవచ్చని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ సతీశ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ట్రాక్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వీసీ ఓఎస్‌డీ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్, ఆర్ట్స్, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, విశ్వవిద్యాలయ ఇంజినీర్ ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.
మహిళా ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
కరీంనగర్ క్రైం: మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు మర్యాదగా వ్యవహరించాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. శనివారం కరీంనగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నిర్వహణ తీరుతో పాటు బాధితులకు అందుతున్న సేవలను పరిశీలించారు. పెండింగ్‌లో కేసులను సమీక్షించి, వాటి ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా బాధితులకు ‘భూమిక’ ద్వారా అందిస్తున్న కౌన్సెలింగ్ సేవలపై ఆరా తీశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ పుల్లయ్య ఉన్నారు.
కొత్తపల్లి: విద్యుత్ తీ గలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేప థ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.వావిలాలపల్లి ఫీడర్ పరిధిలోని హోండా షోరూం, పాత అలహాబాద్‌బ్యాంక్, జెండా గద్దె ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.శివనగర్ ఫీడర్ పరిధిలోని శివనగర్, సప్తగిరికాలనీ, రాంచంద్రాపూర్ కాలనీ, ప్రగతినగర్, రాంనగర్, ఉదయం 9.30 నుంచి 11.30 వరకు 11 కె.వీ.భగత్‌నగర్, కలెక్టర్ కాంప్లెక్స్ ఫీడర్ల పరిధిలోని కట్టరాంపూర్, వేంకటేశ్వరకాలనీ, విఘ్నేశ్వరకాలనీ, భగత్‌నగర్, ఎర్రగుట్ట, ముకరంపుర, బస్టాండ్, కలెక్టర్ ఆఫీసు, వన్‌టౌన్, జెడ్పీ ఆఫీసు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1,2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
రేకుర్తిలో..
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రేకుర్తి సబ్‌స్టేషన్ పరిఽ దిలోని సమ్మక్క గద్దెలు, కంటి ఆసుపత్రి, ఇందిరమ్మ కాలనీ, స్వామికాలనీ, షేక్‌బీకాలనీ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ‘వసూళ్ల’ దందా?
కరీంనగర్ క్రైం: కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికి కోర్టుకు వెళ్తే జైలు శిక్ష పడుతుందనే భయంతో పోలీసులను సంప్రదించిన కొందరు వాహనదారుల నుంచి రూ.15వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. స్టేషన్‌రైటర్, కోర్టు కానిస్టేబుల్ కుమ్మకై ్క డబ్బులిచ్చిన వారి స్థానంలో డూప్లికేట్ వ్యక్తులను కోర్టుకు పంపించడం, ఫేక్ చలాన్లు చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం తెలిసి సీపీ ఏఆర్ ఏసీపీ సి.ప్రతాప్‌తో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ జరిపి ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. దీని వెనక ఎవరున్నా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.


