ఉద్యోగులు, వ్యాపారులే లక్ష్యంగా..
● రెండేళ్ల తర్వాత కేసులో ట్విస్ట్
● విలేకరుల ముసుగులో వేఽధింపులు
● ఇద్దరు నిందితులను
అరెస్టు చేసిన పోలీసులు
కామారెడ్డి క్రైం : వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేసే మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య కేసులో రెండేళ్ల తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విలేకరుల ముసుగులో కొందరు వ్యక్తులు బెదిరింపులు, డబ్బుల డిమాండ్‌కు పాల్పడటమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉండగా మరో ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నివాసం ఉండే చేపూరి శిరీష (28) వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్‌గా పని చేసేవారు. విలేకరుల ముసుగులో వసూళ్లకు పాల్పడే కొందరు వ్యక్తులు ఆమె ఉద్యోగం, జీతం, సర్వీస్ వివరాలను ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించి, ఉద్యోగం కోల్పోయేలా చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను బాపూరావు, ఇందూరి సిద్దాగౌడ్, లాండె భాస్కర్‌గా గుర్తించారు. బాపూరావు ఇటీవలే పీడీ యాక్టు నమోదై జైలులో ఉండగా, మిగిలిన ఇద్దరిని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారన్నారు.
నిందితులు ముగ్గురు విలేకరులుగా పరిచ యం చేసుకొని ఉద్యోగులు, వ్యాపారులు, పలుకుబడి కలిగిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తేలింది. చాలామందికి ఇదే తరహాలో డబ్బులు ఇవ్వకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తామని, ఉద్యోగాలు పోయేలా చేస్తామని, వ్యతిరేక వార్తలు రాస్తామని బెదిరింపులకు పాల్పడిన ఆధారాలు లభించాయని డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ, గాంధారి, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లలో గతంలోనూ కేసులు నమోదై ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఫార్మసిస్ట్ శిరీషపై ఒత్తిడి, బెదిరింపులు, మానసిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బంది పాల్గొన్నారు.


